ఆ రెండు సినిమాలపైనే మెహ్రీన్ ఆశలు!

mehreen kaur career depends on those two films
mehreen kaur career depends on those two films

మెహ్రీన్ కౌర్ పిర్జాడ.. టాలీవుడ్ లో హీరోయిన్ల కెరీర్ ఎలా ఉంటుందో అని చెప్పడానికి సరైన ఉదాహరణ. సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువే. పదుల సంఖ్యలో ఇక్కడ హీరోయిన్లుగా ప్రతీ ఏడూ పరిచయమవుతుంటే, అందులో ఒకరో ఇద్దరో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరసగా సక్సెస్ ఇస్తే కనీసం ఐదేళ్ల పాటు ఇక్కడ నిలబడుతున్నారు, స్టార్ హీరోల నుండి అవకాశం వస్తే పదేళ్ల వరకూ టైమ్ ఉంటుంది. ఏదో చాలా రేర్ గా కాజల్, తమన్నా వంటి వారు ఇక్కడ పదిహేనేళ్ళు అవుతున్నా బండి లాగిస్తుంటారు. మెహ్రీన్ కు మొదట్లో హిట్లు బానే వచ్చాయి. హిట్ల మీద హిట్లు అందుకుంది. దాంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ సినిమా హిట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన మహానుభావుడు, రాజా ది గ్రేట్ కూడా సక్సెస్ఫుల్ సినిమాలుగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మెహ్రీన్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. 2017లో సాయి తేజ్ తో చేసిన జవాన్ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత 2018లో హ్యాట్రిక్ ప్లాపులను సొంతం చేసుకుంది. గోపీచంద్ తో చేసిన పంతం, విజయ్ దేవరకొండ సరసన నోటా, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన కవచం.. ఇలా అన్ని సినిమాలు ప్లాప్స్ అయ్యాయి. రీసెంట్ గా దసరాకు విడుదలైన చాణక్య కూడా డిజాస్టర్స్ లో టాప్ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఎఫ్ 2 రూపంలో మెహ్రీన్ కు సూపర్ హిట్ ఖాతాలో పడింది.

ఈ ఒక్క హిట్ అమ్మడి కెరీర్ ను మరింత కాలం ముందుకు తీసుకెళ్లేలా చేస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకుని వాటి ఫలితాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన ఎంత మంచివాడవురా వచ్చే సంక్రాంతికి జనవరి 15న విడుదల కానుంది. అలాగే నాగ శౌర్య హీరోగా చేసిన అశ్వద్ధామ జనవరి 31న విడుదల కానుంది. ఈ రెండు సినిమాలలో కనీసం ఒక్కటైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలి. లేదంటే మెహ్రీన్ కు మరిన్ని కొత్త అవకాశాలు రావడం చాలా కష్టం. ఎందుకంటే మెహ్రీన్ చేతుల్లో ఇప్పుడు తెలుగు సినిమాలు ఏవీ లేవు. అందుకే ఈ సినిమాలు హిట్ అవ్వడం ఆమెకు ముఖ్యం. మరి మెహ్రీన్ కెరీర్ ఈ రెండు సినిమాల తర్వాత ఏ విధంగా టర్న్ అవుతుందో చూడాలి.