తెలంగాణ‌లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు!


తెలంగాణ‌లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు!
తెలంగాణ‌లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు!

దేశంలో క‌రోనా విళ‌యాతాండ‌వం చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లో అదీ హైద‌రాబాద్ లో  క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ ప్ర‌మాద స్థాయికి చేరుకుంటోంది. దీన్ని నివారించాలంటే అధిక టెస్టులు, కంటోమ్మెంట్ జోన్‌లు ఒక్క‌టే మార్గ‌మ‌ని హైకోర్టు స‌హా ప‌లు సామాజిక వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ వైద్య ఆరోగ్య విభాగం కొత్త‌గా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లని ప్రారంభించింది.

మొబైల్ టెస్టింగ్ వెహికిల్ ల్యాబ్స్‌కి తెలంగాణ‌లో భారీ స్పంద‌న ల‌భిస్తోంద‌ని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఐదు మొబైల్ టెస్టింగ్ వాహ‌నాల‌తో ఐదు చోట్ల టెస్ట్‌లు ప్రారంభించారు. శుక్ర‌వారం సిటీలోని మూడు ప్రాంతాల్లో టెస్ట్‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు. మెహిదీప‌ట్నం, జాఫ‌ర్ గూడా, ఖాద‌ర్ బాగ్ ల‌లో టెస్ట్‌లు ప్రారంభించారు. కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాల‌నుకునే వారు ఆధార్ కార్డ్‌, అడ్ర‌స్ ప్రూఫ్‌, మొబైల్ నంబ‌ర్ ఇవ్వాల్సి వుంటుంది. టెస్ట్ చేసిన 24 గంట‌ల్లోపు మొబైల్ నంబ‌ర్‌కు టెస్ట్ ఫ‌లితాలు రానున్నాయి.

మిగ‌తా రాష్ట్రాల త‌ర‌హాలో తెలంగాణ‌లో టెస్ట్‌లు చేయ‌డం లేద‌ని, టెస్టుల్లో పార‌ద‌ర్శ‌క‌త పాటించ‌డం లేదంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప‌లు మార్లు మంద‌లించిన విష‌యం తెలిసిందే. దీంతో రెండు రోజుల క్రితం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కోటిలోని క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌న్‌లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ వెహికిల్స్‌ని అధికారికంగా ప్రారంభించారు.