వేడుకలు వాయిదా వేస్తున్నా..!” – మోహన్ బాబు


Mohan babu postponed his birthday celebrations
Mohan babu postponed his birthday celebrations

“చుట్టుపక్కల వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి. అందరూ బాగుండాలి. ఇదేనా సిద్ధాంతం. అందుకే, ఈ సంవత్సరం మార్చి 19వ తేదీ జరగవలసిన “శ్రీ విద్యానికేతన్” పాఠశాల మరియు కళాశాల వార్షికోత్సవాలనూ అదే రోజు జరిగే నా పుట్టినరోజు వేడుకలను కూడా వాయిదా వేస్తున్నాను. సహృదయంతో అర్థం చేసుకొని అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు సహకరించాలని కోరుకుంటున్నా. నాకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియచేయడానికి మీరు ఇంత దూరం ప్రయాణం చేసి రావద్దు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న పెద్దల మాటను గుర్తు పెట్టుకోండి. మీ అభిమానమే నాకు కొండంత అండ. మీ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష. అందరికీ ఉగాది శుభాకాంక్షలు”… అని మోహన్ బాబు గారు ఒక భావోద్వేగభరితమైన సందేశం విడుదల చేసారు.

 “ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కన్నా.. అన్ని పూటలా ఆకలి తీర్చే విద్యాదానం మిన్న..!” అన్న పెద్దల మాటను మనసారా పాటించి ఆచరణలో పెట్టిన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. ఆయన తన విద్యాసంస్థలు స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ కూడా కుల మతాలకతీతంగా ప్రతియేటా కొంతమంది సామాన్య పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్ధులు అందజేస్తున్నారు.

 ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జరగవలసిన వేడుకలను ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో వాయిదా వేశామని ప్రకటించారు మోహన్ బాబు.  ముఖ్యంగా కరోనా వైరస్ జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంటూ, అదే విధంగా అందరినీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండండి విజ్ఞప్తి చేశారు మోహన్ బాబు. 1992 వ సంవత్సరంలో శ్రీ విద్యానికేతన్ అనే విద్యాసంస్థలు ప్రారంభించిన మోహన్ బాబు గారు ఆధ్వర్యంలో ఆ సంస్థలో సుమారు 40 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు.