మార్నింగ్ షో ఫ్రీ అంటున్నాడు.. పనవుతుందా?Morning show free for beach road Chetan
Morning show free for beach road Chetan

ఈ మధ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ థియేటర్లకు జనాలు వచ్చే సంఖ్య గత కొన్నేళ్లుగా చాలా తగ్గిపోయిందని చెప్పుకొచ్చాడు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లు రావడం దీనికి ప్రధాన కారణంగా సురేష్ బాబు అంటున్నాడు. నెల రోజులకు, లేదా 50 రోజులకు డిజిటల్ మీడియాలో సినిమా వచ్చేస్తుంటే అన్ని ఇబ్బందులు పడి థియేటర్లకు ఎవరు వస్తారని సురేష్ బాబు అభిప్రాయపడుతున్నాడు. నిజమే.. ఇప్పుడు థియేటర్ కు రావడమంటే పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఇదివరకంటే సినిమాలే సామాన్యులకు ప్రధాన వినోద సాధనం. అయితే డిజిటల్ విప్లవం మొదలయ్యాక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, డిజిటల్ కంటెంట్ అంటూ బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ సాధనాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసాయి. దీంతో ట్రాఫిక్ లో ఎన్నో ఇబ్బందులు పడి థియేటర్ కు వెళ్లి అక్కడ గూబగుయ్యమనే పాప్ కార్న్ రేట్లు భరించలేక జేబులు గుల్ల చేసుకుని ఇంటికి వస్తున్నారు. నలుగురున్న ఫ్యామిలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు వెళ్లి రావాలంటే 1200 నుండి 1500 రూపాయల దాకా అవుతోంది. ఏవ్ డబ్బులు ఏ అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏడాది పొడుగునా వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఎన్ని సార్లు కావాలన్నా చూసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎవరికి వీలయితే వాళ్ళే చూసుకోవచ్చు. ఇన్ని సౌలభ్యాలు ఉండబట్టే ఇప్పుడు థియేటర్ల కన్నా తర్వాత ఏ ప్రైమ్ లో వచ్చినప్పుడో చూసుకోవచ్చులే అనుకుంటున్నారు జనాలు. ఏదైనా బాహుబలి, సైరా లాంటి స్పెషల్ సినిమాలు చూడటానికే థియేటర్ల వైపు అడుగులేస్తున్నారు. ఇక చిన్న సినిమాల పరిస్థితి చెప్పుకోవాల్సిన పనిలేదు. సురేష్ బాబు అన్నట్లు సినిమా అనేది వీకెండ్ బిజినెస్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాలు బతకడం అంటే చాలా కష్టం.

ఇలాంటి టఫ్ పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ఈ వారాంతం విడుదల కానుంది. రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి చిత్రాల్లో హీరోగా నటించిన చేతన్ మద్దినేని దర్శకుడిగా, నిర్మాతగా మారి చేసిన సినిమా బీచ్ రోడ్ చేతన్. ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ తీసుకొచ్చే ప్లాన్ లో భాగంగా మార్నింగ్ షో ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ గా వేస్తున్నారు. తమ కంటెంట్ మీద నమ్మకం ఉండడంతోనే ఇలా చేస్తున్నామని చేతన్ అంటున్నాడు. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఫలానా సినిమా ఫ్రీ గా వేస్తున్నాడంటే ఫ్రీ గా వచ్చేవాళ్ళు ఎంత మంది? తర్వాత అమెజాన్ లో వచ్చినప్పుడు చూసుకుందాంలే..ఈ మాత్రం సినిమాకు థియేటర్ దాకా ఎందుకురా అనుకునే బాపతే ఎక్కువ ఉంటారు.

మరి ఎన్ని సినిమాలు ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న చేతన్ ఈసారైనా తన ప్రయత్నంతో సక్సెస్ చవి చూస్తాడో లేదో చూడాలి. అన్నట్లు ఈ చిత్రానికి పోటీగా ఈ వీకెండ్ మరో అరడజనకు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ బీచ్ రోడ్ చేతన్ ఈ ఫ్రీ పబ్లిసిటీతో ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.