మీడియం బడ్జెట్ సినిమాలతో కిందామీదా పడుతున్న మైత్రి


 

Mythri Movie Makers medium budget films are flops
Mythri Movie Makers medium budget films are flops

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్ లో దూసుకొచ్చిన బాణం అని చెప్పవచ్చు. రావడం రావడమే మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఇచ్చిందీ సంస్థ. మూడూ కూడా ముగ్గురు టాప్ స్టార్స్ తో చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాలుగేళ్లలో చేసినవి మూడే సినిమాలు. అయితేనేం మూడూ కూడా అందరికీ భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ మూడు సినిమాలు ఏమిటో ఈపాటికే మీకు అర్ధమై ఉందిగా. తొలి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు చేసారు. మహేష్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది శ్రీమంతుడు. ఇక రెండో సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ తెరకెక్కించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక మూడో సినిమా రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది రంగస్థలం. 2018లో ఈ సినిమా విడుదలైంది.

అయితే అప్పటివరకూ టాప్ స్టార్స్ తో చేసిన మైత్రి ఎక్కడా ఇబ్బంది పడలేదు. కానీ 2018లో మీడియం బడ్జెట్ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుని బొక్కబోర్లా పడింది. మీడియం బడ్జెట్ లో చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడం గమనార్హం. ముందుగా 2018లోనే నాగ చైతన్య హీరోగా సవ్యసాచి తెరకెక్కింది. ఒక ఆసక్తికర కథాంశం ఉన్నా సరిగ్గా తీయకపోవడం వల్ల సవ్యసాచి ఫెయిల్ అయింది. ఇక దాని తర్వాత చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఫలితం గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. అంత పెద్ద ప్లాప్ అయింది ఈ సినిమా. అమర్ అక్బర్ ఆంటోనీని కొనుక్కున్న వాళ్ళు నట్టేట మునిగిపోయారు.

అయితే 2019లో చిత్రలహరి ద్వారా ఓ మోస్తరు విజయం సాధించి కొంత ఊరట పొందింది మైత్రి. కానీ వెంటనే ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ విఫలమవడం మైత్రికి పెద్ద ఎదురుదెబ్బ. న్యాచురల్ స్టార్ నానితో రీసెంట్ గా చేసిన గ్యాంగ్ లీడర్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా నష్టాలు తప్పలేదు. ఈ రకంగా మైత్రి సంస్థ గత ఏడాది నుండి నష్టాలే ఎక్కువ చవిచూస్తోంది. ప్రస్తుతం మైత్రి మూవీస్ ఆశలన్నీ సుకుమార్ – అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీదే ఉన్నాయి. ఈ సంస్థ నష్టాలను కొంతైనా పూడ్చుకోవాలంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే.

ఇదిలా ఉంటే మరో మీడియం బడ్జెట్ సినిమా మైత్రి గుండెల్లో గుబులు రేపుతోంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం బడ్జెట్ పరిమితులు దాటి వెళ్లిపోయిందని తెలుస్తోంది. కొత్త హీరో, కొత్త దర్శకుడు ఉండడంతో బిజినెస్ పరంగా క్రేజ్ కూడా లేదు. డెఫిసిట్ లో విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. మరి మైత్రి మూవీస్ కు 2020 ఎలా ఉంటుందో చూడాలి.