కాపీ ఆరోప‌ణ‌ల‌పై మైత్రీ టీమ్ క్లారిటీ!


Mytri movie makers strong counter to rajesh
Mytri movie makers strong counter to rajesh

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌ల చిరంజీవి పుట్టిన రోజున విడుద‌లైన విష‌యం తెలిసిందే. మోష‌న్ పోస్ట‌ర్ అదిరిపోవ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్ర క‌థ‌పై రాజేష్ అనే వ్య‌క్తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై మైత్రీ టీమ్ స్పందించింది.

రాజేష్ అనే వ్య‌క్తి చేసిన ఆరోప‌ణ‌లు ఆస‌త్య‌మ‌ని, మేము అత‌ని క‌థ‌కు `అన్న‌య్య‌` అనే పేరుని పెట్టాల‌ని కొర‌టాల శివ‌కు తెలియ‌జేశామ‌ని చెప్ప‌డం అబ‌ద్ధ‌మ‌ని, అత‌ని ఆరోప‌ణ‌లు పూర్తిగా ఖండిస్తున్నాయ‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ తెలియ‌జేసింది. గ‌తంలో మేము నూత‌న ద‌ర్శ‌కుల‌ని ప‌రిచ‌యం చేశాం. `డియ‌ర్ కామ్రేడ్‌`తో భ‌ర‌త్ క‌మ్మ‌, మ‌త్తు వ‌ద‌ల‌రా తో రితేష్ రానా, `ఉప్పెన‌`తో బుచ్చిబాబు ను ప‌రిచ‌యం చేశాం. రాజేష్ మాకు వినిపించిన క‌థ బాగుంటే అత‌నితో కూడా సినిమా నిర్మించే వాళ్లం. క‌థ బాగాలేక‌పోవ‌డంతో అత‌ని క‌థ‌ని తిర‌స్క‌రించాం. ఇక బాగాలేని క‌థ‌తో వేరే వారికి సినిమా నిర్మించాల‌ని ఎందుకు చెబుతాం?. అని ప్ర‌శ్నించారు.

ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా కొర‌టాల శివ ప్ర‌తిభ గురించి అంద‌రికి తెలుసు. క‌మ‌ర్శియ‌ల్ అంశాల‌తో పాటు త‌న ప్ర‌తి సినిమాలో సామాజిక ప్ర‌యోజ‌నం కూడా జోడించే కొర‌టాల శివ‌గారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థ‌ర‌హితమైన ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. మీడియాలో రాజేష్ చేసిన ఆరోప‌ణ‌లు ఖండించ‌డంతో పాటు ఆయ‌న‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం. రాజేష్ చేసిన చౌక‌బారు ఆరోప‌ణ‌ల్ని, జిమ్మిక్కుల్ని అంద‌రూ న‌మ్మొద్ద‌ని కోరుకుంటున్నాం` అని మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ వెల్ల‌డించింది.