నాగ్ అశ్విన్.. ఆ స్థాయి మూడో దర్శకుడు అవుతాడా?


Nag Ashwin to prove his worth nation wide
Nag Ashwin to prove his worth nation wide

ఇదివరకు సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకు ఒకరకమైన చిన్న చూపు ఉండేది. ఇక్కడ మూస రకమైన కమర్షియల్ చిత్రాలు మాత్రమే వస్తాయని వాళ్ళ భావన. నిజంగానే ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఒకలాంటి స్తబ్దత నెలకొంది. కమర్షియల్ హంగుల పేరిట మూస ధోరణిలోకి తెలుగు సినిమా వెళ్ళిపోయింది. అయితే గత ఆరేడేళ్ల నుండి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇక్కడ కూడా కంటెంట్ ఉన్న సినిమాలు రావడం మొదలయ్యాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో తెలుగు సినిమాలపై ఉండే భావన పూర్తిగా మారిపోయింది. జాతీయ స్థాయిలో అందరూ గర్వపడే సినిమాగా బాహుబలి నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి గుర్తింపు వచ్చింది. రాజమౌళి అంటే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై బాలీవుడ్ వాళ్ళ దృష్టి బాగానే ఉంది. ఈ సినిమాను బాహుబలి రేట్లకు మించి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

ఇక రాజమౌళి తర్వాత బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన ఈ దర్శకుడు, కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో హాట్ సెన్సేషన్ అయ్యాడు. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో అందరినీ ఆకర్షించిన సందీప్ వంగ ఇప్పుడు రెండో సినిమా కూడా బాలీవుడ్ లో తీయనున్నాడు. అది కచ్చితంగా సౌత్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరో ప్యాన్ ఇండియా మూవీ వస్తోందన్నమాట.

ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ప్యాన్ ఇండియా మూవీ తీయదలిచాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ తో తన తర్వాతి చిత్రం ఉంటుందని ప్రకటించాడు నాగ్ అశ్విన్. ఇది ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని చెప్పి అందరి అంచనాలను పెంచేసాడు. నాగ్ అశ్విన్ కనుక ఈ సినిమాను హిట్ చేసి ప్యాన్ ఇండియా లెవెల్లో విజయాన్ని అందుకోగలిగితే టాలీవుడ్ నుండి మరో దర్శకుడు బాలీవుడ్ లో పాగా వేసినట్లే.