లవర్ బాయ్ Vs యాక్షన్ హీరో


లవర్ బాయ్ Vs యాక్షన్ హీరో
లవర్ బాయ్ Vs యాక్షన్ హీరో

సినిమాలో హీరోకి విలన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఫిలాసఫీ లా అనిపించినా.. ఒక మాట మాత్రం చెప్పక తప్పదు. అదేమిటంటే సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు హీరోకి తనతోనే తనకు యుద్ధం జరుగుతూ ఉంటుంది.
అన్నిసార్లు తను అనుకున్న సినిమాలు హిట్ అవ్వకుండా, తాను ఎలా అయితే ఉందామనుకున్నా.. అలాంటి ఇమేజ్ దొరకకుండా ప్రేక్షకులు వేరొక ఇమేజ్ సదరు ఆర్టిస్ట్ కు కట్టబెట్టినప్పుడు, అతను తర్వాత ఎంత త్వరగా ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, మళ్లీ కమర్షియల్ లెక్కలకు అనుగుణంగా మారతాడు.? అనే దానిమీదే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం యువ హీరో నాగ శౌర్య అలాంటి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడో 2011లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో “ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “జో అచ్యుతానంద”, “చలో” లాంటి సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. ఈ హీరో రీసెంట్ మూవీ “అమ్మమ్మ గారి ఇల్లు” హిట్ కాలేదు. కాకపోతే గత ఏడాది సమంత క్రేజి సినిమా “ఓ బేబీ” లో సమంత కాంబినేషన్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

తన ఏజ్ కి తగ్గట్లు లవ్ స్టోరీస్ చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ను కంటిన్యూ చేద్దాం.! అనుకున్న నాగశౌర్య కు “లక్ష్మీ రావే మాఇంటికి”, జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి, కల్యాణ వైభోగమే, ఒక మనసు, నీ జతలేక, కథలో రాజకుమారి, కణం, నర్తనశాల ఇలా సినిమాలు పరాజయం పాలవడంతో ఈ కొత్త సంవత్సరంలో తనని తాను కొత్తగా ప్రేక్షకులకు ముందుకు ఆవిష్కరించుకునే కసితో అశ్వత్థామ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాకు కథ కూడా నాగశౌర్య ని అందించడం గమనార్హం. ఇక సినిమా ప్రమోషన్ అంశాలు అన్నిట్లోనూ నాగశౌర్య తనని ఒక యాక్షన్ హీరో అన్న అంశాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. అసలు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ కి యాక్షన్ హీరో ఇమేజ్ కి మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది.

అప్పుడెప్పుడో మన తరుణ్, ఉదయ్ కిరణ్ దగ్గర్నుంచి చూసుకుంటే, ఇప్పుడు కొత్తగా సినిమా బడ్జెట్ అంతా తానే భరించి హీరోలుగా అవతారమెత్తుతున్న బాయిలర్ కోళ్ల వరకు అందరూ యాక్షన్ హీరో ఇమేజ్ కోసమే ట్రై చేస్తున్నారు. కానీ ఒప్పుకోవాల్సిందే విషయం ఏమిటంటే ప్రేక్షకులు ఒకపట్టాన యాక్షన్ హీరోగా ఎవరినీ ఒప్పుకోరు. యాక్షన్ హీరో ఇమేజ్ పొందాలి అంటే అదే స్థాయిలో వినోదం కూడా పంచాలి. మరియు ఎమోషనల్ గా కూడా నటించగలగాలి. మొత్తానికి ఈ దశాబ్దాన్ని కొత్తగా మొదలు పెట్టిన నాగశౌర్య యాక్షన్ హీరోగా సక్సెస్ అయ్యి, ఇంకా మంచి మంచి సినిమాలు మనకు అందించాలని కోరుకుందాం.