ప్లాప్ దర్శకుడితో ముందుకెళ్లనున్న ప్లాప్ హీరో


Naga Shourya sets up another movie
Naga Shourya sets up another movie

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. తను నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ వరసగా బోల్తా కొట్టాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అశ్వద్ధామ సైతం ఈ హీరోకు నిరాశనే మిగిల్చింది. యాక్షన్ హీరో అవుదామనుకున్న శౌర్యకు మరోసారి చుక్కెదురైంది. స్వయంగా రంగంలోకి దిగి కథ సిద్ధం చేసుకున్నా సరే పనవ్వలేదు. అయినా వరస ప్లాపులు వచ్చినా కానీ శౌర్య మాత్రం బిజీగానే ఉన్నాడు. వరసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు శౌర్య, తాను హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా మహిళా దర్శకురాలు సౌజన్య తెరకెక్కిస్తున్న ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శౌర్య నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అలాగే మహేష్ ఎస్ కోనేరు నిర్మాతగా కొత్త దర్శకుడితో చేయబోతున్న మరో సినిమా లాంచ్ నిన్ననే జరిగింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇవి కాకుండా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా షూటింగ్ ను 50 శాతం పూర్తి చేసాడు. మరో సగం షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఇలా తీరిక లేకుండా నటిస్తూ ఉన్న శౌర్య ఇప్పుడు మరో సినిమాను సెట్ చేసుకున్నాడు.

పైన చెప్పుకున్న మూడు సినిమాలూ బయట బ్యానర్లకు చేస్తోన్న ఈ హీరో ఇప్పుడు నాలుగో సినిమాను తన సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించనున్నాడు. ఈ సంస్థ ఇప్పటిదాకా మూడు సినిమాలను నిర్మించింది. మొదటి సినిమా ఛలో పెద్ద హిట్ కాగా రెండో సినిమా నర్తనశాల ప్లాపైంది. ఇక అశ్వద్ధామ కూడా పోయింది. ఇప్పుడు నాలుగో సినిమాకు పనులు మొదలయ్యాయి. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర దర్శకత్వంలో శౌర్య నటించనున్నాడు. ఈ సినిమాకు కూడా నాగ శౌర్యే కథ అందించనుండడం విశేషం. మరి ఇప్పటిదాకా సరైన హిట్టు లేని ఈ దర్శకుడు, ఈ మధ్యలో హిట్ అన్నది చూడని ఈ దర్శకుడు ఎటువంటి సినిమాను అందిస్తారో చూడాలి.