ఆన్‌లైన్ క్లాసులు వింటున్న నాగ్‌!

ఆన్‌లైన్ క్లాసులు వింటున్న నాగ్‌!
ఆన్‌లైన్ క్లాసులు వింటున్న నాగ్‌!

కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవలే `వైల్డ్ డాగ్` చిత్రంలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. హీరో నాగార్జున‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయ‌న ప్రవీణ సత్తారు దర్శకత్వంలో మరో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు.

తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రంలో నటించబోయే కొన్ని యాక్షన్ స్టంట్స్‌లో శిక్షణ పొందడానికి నాగార్జున ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నార‌ట‌. బ్యాంకాక్‌ చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడి పర్యవేక్షణలో నాగార్జున ఈ శిక్షణా సెషన్లలో పాల్గొంటున్నార‌ని తెలిసింది. క్రావ్ మగా (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆత్మరక్షణ కోసం ఉప‌యోగించే క‌ళ‌), సమురాయ్ స్వోర్డ్ ఫైటింగ్ లను నాగ్‌ నేర్చుకుంటున్నార‌ట‌. గతంలో తెలుగు సినిమాల్లో ఎప్పుడూ చూడని మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట్స్‌ని ఈ చిత్రం కోసం దర్శకుడు ప్రవీణ్ సత్తారు  ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ షూటింగ్‌ని హైదరాబాద్, గోవాలో కొంత భాగం పూర్తి చేసింది. తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆమెపై ప‌లు   యాక్షన్ సన్నివేశాల‌ని కూడా చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.  నాగ్ ఈ చిత్రంలో వెటరన్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని నారాయణ్ దాస్ నారంగ్, శరత్ మరార్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.