తన తర్వాతి సినిమాపై పెదవి విప్పిన నాగ్


తన తర్వాతి సినిమాపై పెదవి విప్పిన నాగ్
తన తర్వాతి సినిమాపై పెదవి విప్పిన నాగ్

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం. సోలోగా చేసిన ఫక్తు కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ వరసగా బాల్చీ తన్నేస్తుండడంతో నాగార్జునలో అంతర్మధనం మొదలైంది. నాగ్ లాస్ట్ చేసిన మన్మథుడు 2 పై చాలానే ఆశలు పెట్టుకోగా, ఈ సినిమా ప్లాప్ అవ్వడం అటుంచితే, మన్మథుడు పేరుని చెడగొట్టడంతో రెండిటికీ చెడ్డట్లు అయింది. అయితే ఆ తర్వాత నాగార్జున బిగ్ బాస్ తో బిజీ అయిపోవడంతో తర్వాతి సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం రాకుండా పోయింది. ఇప్పుడు బిగ్ బాస్ అయ్యి నెల రోజులు కావొస్తోంది. ఇంకా తర్వాతి సినిమాపై ఏ విధమైన నిర్ణయమూ తీసుకోలేదు నాగార్జున. చేతిలో చేయడానికి సినిమాలు ఉన్నాయి కానీ దేన్నీ ముందు పట్టాలెక్కించాలి అన్న దగ్గరే నాగార్జున ఆగిపోతున్నాడు. స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు.

నాగార్జున ఎప్పటినుండో చేస్తానని చెబుతున్న బంగార్రాజు స్క్రిప్ట్ విషయం ఏమైందో కూడా తెలీదు. ఇప్పటికే ఒక అరడజను సార్లు స్క్రిప్ట్ మార్చమని తిప్పి వెనక్కి పంపాడట. ఈ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఊడుతుందో అర్ధం కాని పరిస్థితి. బంగార్రాజు కాకుండా బాలీవుడ్ హిట్ సినిమా రైడ్, నాగార్జునకు నచ్చిందని, రీమేక్ చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంతో అని క్లారిటీ తెచ్చుకుందామని నాగ్ ను అడిగితే, రైడ్ చూశానని, తనకు బాగా నచ్చిందని, స్క్రిప్ట్ ను సిద్ధం చేసి తీసుకురమ్మన్నట్లుగా నాగార్జున చెప్పాడు. అంటే ఇప్పిడిప్పుడే రైడ్ సినిమా చేసే ఉద్దేశం నాగ్ కు లేనట్లుంది.

రైడ్ కాకుండా వంశీ పైడిపల్లి శిష్యుడు సోలమన్ చెప్పిన ఒక కథ నాగ్ కు నచ్చిందట. ఈ సినిమాను ముందు పట్టాలెక్కిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. సోలమన్.. వంశి పైడిపల్లి దగ్గర మహర్షి, ఊపిరి సినిమాలకు పనిచేసాడు. ఊపిరి సమయంలో నాగ్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఒక లైన్ నరేట్ చేయగా అది నచ్చిన నాగార్జున పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని, నచ్చితే తప్పకుండా చేద్దామని అన్నాడు. మరి ఈ ప్రాజెక్టులలో ఏది ముందు మొదలుపెడతాడో చూడాలి.