కంగ‌న‌కు కూడా స‌మ‌న్లు ఇవ్వాల్సిందే అంటోంది!


కంగ‌న‌కు కూడా స‌మ‌న్లు ఇవ్వాల్సిందే అంటోంది!
కంగ‌న‌కు కూడా స‌మ‌న్లు ఇవ్వాల్సిందే అంటోంది!

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వివాదం స‌రికొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఏకంగా రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవ‌ల బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదాన్ని పార్ల‌మెంట్‌లో బీజేపీ ఎంపీ ర‌వికిష‌న్ ప్ర‌స్థావించడంతో జయా బ‌చ్చ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆ త‌రువాత ఆమె వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ న‌టి, బీజేపీ ఎంపీ జ‌య‌ప్ర‌ద సంచ‌ల‌న ప్ర‌క‌టన చేయ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపింది. ఈ వివాదం స‌ద్దుమ‌నిగింది అనుకుంటున్న త‌రుణంలో మ‌రో సీనియ‌ర్ న‌టి, కాంగ్రెస్ నాయ‌కురాలు న‌గ్మ కూడా ఈ వివాదంలో త‌ల‌దూర్చ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

డ్ర‌గ్స్ వివాదం ఒక్క‌సారిగా రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. తాజాగా న‌గ్మ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. గ‌తంలో డ్ర‌గ్స్ అల‌వాటు వుండేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన కంగ‌న‌కు ఎన్సీబీ ఎందుకు స‌మ‌న్లు జారీ చేయ‌డం లేద‌ని మండిప‌డింది. సుశాంత్ మృతి చుట్టూ డ్ర‌గ్స్ కోణం వుంద‌ని అనుమానాలు రేకెత్తుతున్న వేళ ఆ కోణంలో ఎన్సీబీ అధికారులు విచార‌ణ మొద‌లుపెట్టారు. రియాని, ఆమె పోద‌రుడు షోవిక్‌ని అదుకులోకి తీసుకోవ‌డంతో కీల‌క విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలెంట్ మేనేజ‌ర్ జ‌య సాహా వాట్సాప్ చాట్‌ని ఆధారం చేసుకుని దీపిక‌, శ్ర‌ద్ధా క‌పూర్‌, సారా అలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్‌ల‌కు ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారి చేసిన విష‌యం తెలిసిందే.

దీనిపై న‌గ్మ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. వాట్సాప్ డాటా ఆధారంగా ఎలా స‌మ‌న్లు జారీ చేస్తార‌ని ఎన్సీబీ అధికారుల‌పై మండిప‌డింది. అలాంట‌ప్పుడు కంగ‌న‌కు ఎందుకు స‌మ‌న్లు జారీ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించింది. గ‌తంలో అనురాగ్ క‌శ్య‌ప్‌, దీపిక‌, దియా మీర్జా బీజేపీకి వ్య‌తిరేకంగా స్పందించారు కాబ‌ట్టే వారిపై క‌క్ష సాధిస్తున్నార‌ని మండిప‌డింది. తాజాగా న‌గ్మ వ్యాఖ్య‌ల‌తో బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదం రాజ‌కీయ రంగు పులుముకుంటున్న‌ట్టుగా అనుమానాలు మొద‌ల‌వుతున్నాయి.