హిట్ ఇచ్చిన దర్శకుడితోనే నాని మళ్ళీ..

Nani next movie latest update
Nani next movie latest update

న్యాచురల్ స్టార్ నాని టైమ్ ఈ మధ్య అసలు బాగోట్లేదు. నటన పరంగా నాని వైపు వేలెత్తి చూపించేవారు లేరు కానీ వరసగా తన సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో నాని అసహనానికి గురవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్యాంగ్ లీడర్ చిత్రం చివరికి నిరాశనే మిగిల్చింది. అంతకు ముందు ఎన్నో ప్రశంసలు తెచ్చుకున్న జెర్సీ కమర్షియల్ గా సో సో గా ఆడింది.

ఓవర్సీస్ లో అయితే గత నాలుగు చిత్రాలు లాస్ వెంచర్స్ గా మిగిలాయి. అందుకే నాని ఈసారి రూట్ మార్చి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ సినిమా చేయబోతున్నాడు. నిన్ను కోరి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ రెండో ప్రయత్నం మజిలీ కూడా మంచి విజయం సాధించింది.

మూడో చిత్రం మళ్ళీ నానితోనే చేయాలని శివ నిర్వాణ భావిస్తున్నాడు. ఇందుకోసం ఒక లైన్ కూడా నానికి వినిపించాడట. త్వరలోనే స్క్రిప్ట్ మొత్తం పూర్తవుతుందని వినికిడి. నాని ప్రస్తుతం వి అనే చిత్రంలో నెగటివ్ రోల్ వేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతోంది.