రాక్షసుడిగా నాని.. అరుపులే!

రాక్షసుడిగా నాని.. అరుపులే!
రాక్షసుడిగా నాని.. అరుపులే!

న్యాచురల్ స్టార్ నాని విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. గతేడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో మన ముందుకు వచ్చిన నాని ఈసారి మరింత విభిన్నంగా నెగటివ్ రోల్ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న V చిత్రంలో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఉగాది సందర్భంగా మార్చ్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

ఇటీవలే చిత్ర ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సుధీర్ బాబు లుక్ ను నిన్న విడుదల చేసారు. సుధీర్ బాబును రక్షకుడిగా పరిచయం చేసారు. సుధీర్ బాబు V లో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గన్ పట్టుకుని స్టన్నింగ్ గా ఉన్న సుధీర్ బాబు లుక్ అందరి దగ్గరనుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు రాక్షసుడి లుక్ ను విడుదల చేసారు.

రాక్షసుడిగా నాని పెర్ఫెక్ట్ గా సరిపోయాడనే చెప్పాలి. కళ్ళల్లోనే విలనిజాన్ని పండిస్తూ, చేతిలో కత్తెర, దాన్నుండి రక్తం.. ఇలా నాని లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో నాని పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని భావిస్తున్నారు. కెరీర్ లో ఇన్నాళ్లూ సాఫ్ట్, పాజిటివ్ రోల్స్ చేసిన నాని కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ముఖ్యంగా నాని – సుధీర్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు.

నివేతా థామస్, అదితి రావు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి నుండి ఈ చిత్ర ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.

Credit: Twitter