భూత‌ల స్వ‌ర్గంలో బ‌న్నీ యాక్ష‌న్‌!


New update on Allu Arjun and Sukumar film
New update on Allu Arjun and Sukumar film

భూత‌ల స్వ‌ర్గంగా కేర‌ళకు పేరు. ఇక్క‌డ ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు ప‌ర‌వ‌శించని వారుండ‌రు. అలాంటి చోట బ‌న్నీ యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లి హంగామా చేయ‌బోతున్నారు. ఈ ఏడాది `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుని శుభారంభాన్నిఅందించిన అల్లు అర్జున్ త్వ‌ర‌లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయబోతున్న విష‌యం తెలిసిందే. `అల..` హిట్ త‌రువాత జాలీ మోడ్‌లోకి వెళ్లిపోయిన బ‌న్నీ త్వ‌ర‌లోనే కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టబోతున్నాడు.

మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా మాస్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని సుకుమార్ రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేశారు. రెండ‌వ షెడ్యూల్ మార్చి 13 నుంచి కేర‌ళ‌లో ప్రారంభం కాబోతోంది. అత్య‌థిక భాగం రూర‌ల్ ఏరియాల్లో షూటింగ్ జ‌ర‌ప‌బోతున్నారు. ముఖ్యంగా కేర‌ళ అడ‌వుల్లో చిత్రీక‌రించే స‌న్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ట‌.

కేర‌ళ‌లో సుకుమార్ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. మొత్తం 40 రోజుల పాటు కేర‌ళ అడ‌వుల్లో షూటింగ్ చేయ‌బోతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. చిత్తూరు నేప‌థ్యంలో సాగే రివేంజ్ డ్రామాగా ఊర మాస్ క‌థ‌గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నారు. అల్లు అర్జున్ , విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు రోమాంచితంగా ఉంటాయ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.