అర్జున్ సురవరం చిత్రంపై సెల్ఫ్ కౌంటర్లు


Nikhil and Vennela Kishore self troll on Arjun Suravaram
Nikhil and Vennela Kishore self troll on Arjun Suravaram

యంగ్ హీరో నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా అర్జున్ సురవరం. తమిళ్ సూపర్ హిట్ చిత్రం కనిదన్ కు రీమేక్ గా అర్జున్ సురవరం తెరకెక్కింది. మొదట ఈ చిత్రాన్ని ముద్ర పేరుతో తెరకెక్కించినా తర్వాత వేరే నిర్మాత అదే పేరుతో సినిమాను విడుదల చేసేయడంతో పేరు మార్చక తప్పని పరిస్థితి. అందుకే ఈ సినిమాలో నిఖిల్ పోషించిన అర్జున్ లెనిన్ సురవరం పాత్రనే టైటిల్ గా పెట్టారు. పేరు మార్చాక కూడా నిఖిల్ సినిమాపై క్రేజ్ ఉంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు చాలామంది ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూసారు. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో నిఖిల్ మళ్ళీ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడని ఆశించారు.

అయితే మరో మూడు వారాల్లో రిలీజ్ ఉందని ప్రకటించాక కూడా సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. అక్కడినుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ సినిమా ఏడాది పాటు అలాగే నిలిచిపోయింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈసారైనా విడుదలవుతుందా అంటూ రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు కొంత మంది జోకులు వేసుకున్నారు. ఇది నిఖిల్ అండ్ కో గమనించింది. దాన్నే తమ సినిమాకు ప్రమోషన్స్ గా వాడేసుకుంది.

కొద్దిసేపటి క్రితం నిఖిల్ ఒక వీడియో బైట్ వదిలాడు. అందులో వెన్నెల కిషోర్ డబ్బింగ్ ముగించుకుని స్టూడియో నుండి బయటకు వస్తుంటాడు. నిఖిల్ తనని ఆపి డబ్బింగ్ పూర్తిచేసినందుకు థాంక్యూ.. అర్జున్ సురవరం నవంబర్ 29న విడుదలవుతోంది అని చెప్తాడు. దానికి వెన్నెల కిషోర్ పట్టించుకోనట్లు వెళ్లిపోతుంటే నిఖిల్ మళ్ళీ ఆపి నిజంగానే 29న విడుదలవుతోంది అంటాడు. దానికి వెన్నెల కిషోర్ విసుగ్గా ఇదే జోక్ ఎన్నిసార్లు చెప్తావయ్యా అంటాడు. వెంటనే నిఖిల్ లేదు నిజంగా 29న వస్తోంది అనగానే నిఖిల్ ను హగ్ చేసుకుని ఆనందభాష్పాలు కారుస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి రిలీజ్ డేట్ ను చెప్పి ఆదరించమని ప్రేక్షకులను అడుగుతారు.

ప్రస్తుతం ఈ వీడియో భలే వైరల్ అవుతోంది. తమ మీదే సెల్ఫ్ ట్రోల్ వేసుకోవడంతో అందరినీ ఆకర్షిస్తోంది. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సంతోష్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ ఆ నటించింది.