వరసగా సినిమాలను లైన్లో పెడుతోన్న నిఖిల్Nikhil announces his next films after Arjun Suravaram
Nikhil announces his next films after Arjun Suravaram

ఏడాది పాటు నరకం అనుభవించి ఈ శుక్రవారం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు యువ హీరో నిఖిల్. అర్జున్ సురవరం, నిఖిల్ ను చాలా ఇబ్బంది పెట్టిందన్నది వాస్తవం. సినిమా షూటింగ్ పూర్తవుతోంది అన్న సమయంలో టైటిల్ విషయంలో వివాదం తలెత్తడం, తర్వాత టైటిల్ మార్చుకుని విడుదలకు సిద్ధమవుతుంటే కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం కావడం జరిగాయి. అయితే ఆ ఆలస్యం ఏకంగా ఏడాది పాటు ఉంటుందని ఊహించలేకపోయాడు నిఖిల్. మొదట డిసెంబర్ 2018లో సినిమాను విడుదల చేద్దామనుకున్నాడు. అయితే మొదటిసారి వాయిదా పడి మే 1 కి మారింది. ఇక అక్కడినుండి సినిమా ఎన్ని సార్లు వాయిదా పడిందో లెక్కే లేదు. సినిమా విడుదలను ప్రకటించడం అది వాయిదా పడటం, అంతా ఓ ఆనవాయితీలా జరిగిపోయింది. అయితే ఈ కాలమంతా తాను ఎన్ని సార్లు గదిలో ఒక్కడ్ని కూర్చుని ఏడ్చానో లెక్కేలేదు అంటున్నాడు నిఖిల్. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన సమయంలో తన కుటుంబం, స్నేహితులు అండగా ఉండి తనకు అండదండగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

ఏదైతేనేం మొత్తానికి నిఖిల్ కష్టాలు గట్టెక్కి అర్జున్ సురవరం నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. పోటీగా వస్తోందన్న రామ్ గోపాల్ వర్మ చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కూడా ఈ వారం విడుదలకావట్లేదు. వాయిదా పడింది. ఇది అర్జున్ సురవరంకు కచ్చితంగా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం థియేటర్లన్నీ మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రేక్షకులు రాక షో లు కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో అర్జున్ సురవరం ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఇక నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసాడు. ఈ సినిమా వల్ల తన కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వచ్చే ఏడాది దాన్ని ఫిల్ చేస్తా అంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

దీంతో పాటు మరో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నట్లు ప్రకటించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీనికి విఐ ఆనంద్ దర్శకుడు. వీరిద్దరూ గతంలో చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సూపర్ హిట్టైన విషయం తెల్సిందే. దీంతో పాటు హనుమాన్ అనే ఒక సోషియో ఫాంటసీ కథను కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలీదని అంటున్నాడు నిఖిల్.

ఇకపోతే శ్వాస అనే సినిమా ప్రకటించిన నిఖిల్, ఇప్పుడు అది చేయట్లేదని దాన్నుండి తప్పుకున్నానని తెలిపాడు. తనకు ముందు చెప్పిన కథ ఒకటని, తర్వాత షూటింగ్ దగ్గరకి వచ్చేసరికి కథ మార్చేశారని, అందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పుడు అదే బ్యానర్లో హనుమాన్ ను చేస్తున్నట్లు తెలిపాడు. మొత్తానికి నిఖిల్ కు మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్లున్నాయి.