నిన్ను తలచి రివ్యూ


Ninnu Thalachi Movie Review in Telugu
Ninnu Thalachi Movie Review in Telugu

నిన్ను తలచి మూవి రివ్యూ:
నటీనటులు: వంశీ ఏకసిరి, స్టెఫీ పటేల్
దర్శకత్వం: అనిల్ తోటా
నిర్మాత‌లు: నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్
సంగీతం: మహావీర
ఎడిట‌ర్‌ : సాయి, అనిల్ తోట
సినిమాటోగ్రఫర్: సత్య
విడుదల తేదీ: 27 సెప్టెంబర్ 2019
రేటింగ్ : 3/5

ఈ వారం విడుదలైన చిన్న సినిమాల్లో చెప్పుకోతగ్గది ‘నిన్ను తలచి’. ఎక్కువగా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
అభిరామ్ (వంశీ ఏకసిరి) అల్లరిచిల్లరిగా తిరుగుతూ, స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేసే సగటు మిడిల్ క్లాస్ కుర్రాడు. తన జీవితం అలా సరదాగా వెళ్లిపోతున్న సమయంలో అంకిత (స్టెపీ పటేల్)ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడిపోతాడు. ఎలా అయినా తన ప్రేమను పొందాలని ప్రయత్నిస్తాడు. కానీ అంకిత మనసులో అప్పటికే వేరొకరు ఉన్నారని అభికి తెలుస్తోంది. అప్పుడు అభి ఏం చేసాడు? అంకిత మనసును మార్చగలిగాడా? లేక తన మనసును చంపుకున్నాడా? పై ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :
అవ్వడానికి నటనకు కొత్త అయినా వంశీ ఏకసిరి ఈ సినిమాలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో, అంకిత మనసులో వేరొకరు ఉన్నారని తెలిసినప్పుడు సీన్ లో అతని నటన చాలా బాగుంది. డ్యాన్సులు కూడా బాగా చేసాడు. సరైన విధంగా కెరీర్ ను షేప్ చేసుకుంటే మంచి హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. స్టెఫీ పటేల్ పర్వాలేదు. తన పాత్రకు న్యాయం చేసింది. అయితే ఇంకా మెరుగవ్వవచ్చు. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అదే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళుతుంది. హీరో స్నేహితుని పాత్రలో చేసిన నటుడు బాగా ఇంప్రెస్ చేస్తాడు. కొన్ని సీన్స్ లో తన కామెడీ భలే పేలింది. మిగతావారంతా మామూలే.

సాంకేతిక వర్గం :
నిన్ను తలచి సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కింది. ఇంత తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ తీసుకురావడంలో చిత్ర బృందం సక్సెస్ అయింది. సాంకేతిక నిపుణులలో ముందుగా చెప్పుకోవాల్సింది మహావీర సంగీతం గురించి. పాటలు వినడానికి బాగున్నాయి. తెరపైన ఇంకా బెటర్ గా ప్రెజంట్ చేయాల్సింది. పాటలకంటే ముందు మహావీర నేపధ్య సంగీతం గురించి మాట్లాడుకోవాలి. కొన్ని సాధారణ సీన్లను కూడా తన నేపధ్య సంగీతంతో నిలబెట్టాడు. కెమెరా మ్యాన్ పనితనం బాగుంది. సినిమాకి రిచ్ లుక్ తీసుకురాగలిగాడు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు అయితే సూపర్ అనే చెప్పాలి. దర్శకుడిగా అనిల్ తోట సగం మార్కులే వేయించుకుంటాడు. కొన్ని సీన్లు ఒక ఫ్లో లేకుండా ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తాయి. కామెడీ పేరుతో కొన్ని సన్నివేశాలు కథకు సంబంధం లేకుండా సాగుతాయి.

చివరిగా :
నిన్ను తలచి ఒక డీసెంట్ రొమాంటిక్ లవ్ డ్రామా. హీరో నటన, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన బలాలు. చాలా పల్చని స్టోరీని తీసుకున్నా దర్శకుడు చాలా వరకూ లైటర్ వీన్ లో సాగేపోయే సన్నివేశాలతో ప్రేక్షకుడికి బోర్ కొట్టించడు. అయితే ఇందాక చెప్పుకున్నట్లు, ఫస్ట్ హాఫ్ లో ఫ్లో లేకుండా వచ్చే కొన్ని సన్నివేశాలు, కామెడీ పేరుతో అవసరం లేని కొన్ని సీన్లు తీసేస్తే నిన్ను తలచి ఒక మంచి లవ్ స్టోరీ అనిపించుకునేది. ఏదేమైనా ఈ వీకెండ్ లుక్ టైమ్ పాస్ కోసం ఒకసారి చూడొచ్చు.

నిన్ను తలచి – టైమ్ పాస్