`నిశ్శ‌బ్దం` కూడా అదే బాట‌ప‌డుతోందా?`నిశ్శ‌బ్దం` కూడా అదే బాట‌ప‌డుతోందా?
`నిశ్శ‌బ్దం` కూడా అదే బాట‌ప‌డుతోందా?

అనుష్క న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. మూగ యువ‌తిగా ఇందులో ఓ ఛాలెంజింగ్ పాత్ర‌లో అనుష్క న‌టించింది. కీల‌క పాత్ర‌ల్లో మాధ‌వ‌న్‌, హాలీవుడ్ న‌టుడు మైఖేల్ మాడ్స‌న్‌, అంజ‌లి, సుబ్బ‌రాజు, షాలినీ పాండే, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల న‌టించారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సింది. అంతా రెడీ ఇక రిలీజ్ అనుకున్న స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డం, వెంట‌నే కేంద్రం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

ఇక అప్ప‌టి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తూనే వున్నాయి. ఈ క‌థ‌నాల్ని చిత్ర బృందం ఎప్ప‌టిక‌ప్పుడు కండిస్తూ వ‌స్తోంది. భారీ వ్య‌యంతో రూపొందిన  ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫ‌ర్ ఇచ్చాయ‌ని, కానీ నిర్మాత‌లు మాత్రం ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లోనే రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇదే సినిమాతో పాటు నాని, సుధీర్‌బాబు క‌లిసి న‌టించి `వి` చిత్రంపై కూడా ఇదే త‌ర‌హా క‌థ‌నాలు వినిపించాయి. తాజాగా `వి` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో సుప్టెంబ‌ర్ 5న రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో `నిశ్శ‌బ్దం`పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది.

ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాల‌ని ఎంత మంది అనుకుంటున్నార‌ని, థియేట‌ర్ల‌లో మాత్ర‌మే చూడాలిన ఎంత మంది అనుకుంటున్నార‌ని ఓ పోల్ నిర్వ‌హిస్తే ఓటీటీలో చూడాల‌నుకుంటున్నామ‌ని అత్య‌ధిక శాతం మంది కోరుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేవ‌లం 29 శాతం మంది మాత్రమే ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో చూడాల‌నుకుంటున్నామ‌ని కోరారు. దీంతో ఇంత కాలంగా డైల‌మాలో వున్న మేక‌ర్స్‌కి ఈ పోల్ తో ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని తాజాగా వినిపిస్తోంది.