నితిన్ కు ఇప్పుడు హీరోయిన్లే బలం!


నితిన్ కు ఇప్పుడు హీరోయిన్లే బలం!
నితిన్ కు ఇప్పుడు హీరోయిన్లే బలం!

యంగ్ హీరో నితిన్ వరసగా మూడు ప్లాపులు కొట్టాడు. దాంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. నితిన్ నుండి సినిమా వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ గ్యాప్ లో వరసగా సినిమాలను సెట్ చేసుకున్నాడు నితిన్. ఈ చిత్రాలు ఎక్కువగా రొమాంటిక్ ఎంటర్టైనెర్స్ కావడం విశేషం. తన బలమేంటో తెలుసుకుని దాని ప్రకారం కథలను సెట్ చేసుకున్నాడు. ముందుగా ఛలో వంటి సూపర్ హిట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. భీష్మ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరో పది రోజుల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 21న భీష్మ విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి.

భీష్మ విషయంలో నితిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తనతో పాటు సినిమాలో హీరోయిన్ గా చేస్తోన్న రష్మికకు కూడా సమ ప్రాధాన్యం దక్కేలా చూసుకుంటున్నాడు. పోస్టర్లు, ప్రోమోలు ఇలా ఏమైనా కానీ రష్మిక కూడా ప్రమోషన్స్ లో హైలైట్ అవుతోంది. ప్రస్తుతం ఈ భామకు సరిలేరు నీకెవ్వరు వల్ల మాస్ ఇమేజ్ వచ్చింది. అందుకనే పోస్టర్లలో కూడా రష్మిక గ్లామరస్ ఫోజులు హైలైట్ అయ్యేలా చూడాలని చెప్పాడు.

ఇక భీష్మ తర్వాత నితిన్ చేస్తోన్న చిత్రం రంగ్ దే. తొలిప్రేమ, mr. మజ్ను చిత్రాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి డైరెక్షన్ ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. స్వతహాగా మంచి పెర్ఫార్మర్ అయిన కీర్తికి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. ఆమెను మహానటి కథానాయికగానే చూస్తున్నారు. సో రంగ్ దే విషయంలో కూడా కథానాయికను హైలైట్ చేయమని సూచించాడు నితిన్. ఈ హీరోకు కంబ్యాక్ హిట్ గా చెప్పుకునే ఇష్క్ విషయంలో నితిన్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. అందులో నిత్యా మీనన్ ఎంతలా హైలైట్ అయిందో మనందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ తన కంబ్యాక్ విషయంలో కూడా నితిన్ ఇదే స్టైల్ ఫాలో అవుతున్నాడు.