పెళ్లి కుదిరింది..హిట్టు అదిరింది!


పెళ్లి కుదిరింది..హిట్టు అదిరింది!
పెళ్లి కుదిరింది..హిట్టు అదిరింది!

గొడ్డొచ్చిన వేళ‌.. బిడ్డొచ్చిన వేళ అన్నారు పెద్ద‌లు.. నితిన్‌ని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజ‌మే అని నిరూపిస్తోంది. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపులు, యాక్సిడెంట్ కార‌ణంగా ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణంలో వున్నా నితిన్ ఇటీవ‌ల త‌ను ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్న షాలినితో పెళ్లికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నెల 15న షాలినితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఇక్క‌డి నుంచే నితిన్ టైమ్ మారిన‌ట్టు క‌నిపిస్తోంది.

వ‌రుస‌గా లై, ఛ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీ‌నివాస క‌ల్యాణం ఫ్లాపులుగా మారాయి. దీంతో నితిన్ కెరీర్ మ‌ళ్లీ గాడిత‌ప్పింద‌ని, మ‌ళ్లీ హిట్‌ని సొంతం చేసుకోవాలంటే శ్ర‌మించ‌క త‌ప్ప‌ద‌నే మాట‌లు వినిపించాయి. ఈ పుకార్ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ `భీష్మ`తో నితిన్ సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ శుక్ర‌వారం విడుద‌లైన `భీష్మ‌` నితిన్ కెరీర్‌కు మంచి బూస్ట‌ప్ హిట్‌గా నిలిచింది. రిలీజ్‌కు ముందే 9 కోట్ల ప్రాఫిట్‌ని ద‌క్కించుకున్న ఈ సినిమా తొలి రోజు హిట్ టాక్‌ని సొంతం చేసుకుని పైసా వసూల్ చిత్రంగా నిలిచింది.

ఇటీవ‌ల సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాయి. ఈ రెండు చిత్రాల త‌రువాత వ‌చ్చిన ఏ సినిమా ఆ స్థాయిలో ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. ఈ శుక్ర‌వారం విడుద‌లై `భీష్మ‌` కు ఇది క‌రెక్ట్ టైమ్ అని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పైగా పెళ్లి కుదిరిన హీరోకు ఈ సినిమా హిట్టు అదిరింద‌ని ఇండ‌స్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు.