నితిన్ కు అంత భారీ బడ్జెట్ రిస్కేమో?


నితిన్ కు అంత భారీ బడ్జెట్ రిస్కేమో?
నితిన్ కు అంత భారీ బడ్జెట్ రిస్కేమో?

యంగ్ హీరో నితిన్ కెరీర్ అయితే వరస విజయాలు, లేదంటే వరస పరాజయాలు అన్నట్లుగా సాగుతుంటుంది. వరసగా 12 ప్లాపుల తర్వాత ఇష్క్ చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్, ఆ తర్వాత వరసగా మూడు విజయాలు అందుకున్నాడు. త్రివిక్రమ్ తో చేసిన అ.. ఆ చిత్రం నితిన్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్. అయితే ఆ తర్వాత నితిన్ కెరీర్ మళ్ళీ గాడి తప్పింది. వరసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నితిన్ భీష్మ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇదే ఊపులో 2020ను యమా బిజీగా గడిపేద్దామని భావించాడు. నితిన్ చేతిలో ఇప్పుడు నాలుగు చిత్రాలున్నాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ రీమేక్ ను తెలుగులో చేయబోతున్నట్లు ప్రకటించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఈ చిత్రాల తర్వాత నితిన్ తన కెరీర్ లో అత్యంత భారీ సినిమాను అటెంప్ట్ చేయబోతున్నాడు.

తన స్నేహితుడు, తనతో ఛల్ మోహన్ రంగా తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడు. పవర్ పేట అనే టైటిల్ ఉన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. నితిన్ మార్కెట్ పరంగా 40-50 కోట్ల రేంజ్ లోనే ఉన్నాడు. మరి అలాంటి హీరోతో 90 కోట్ల సినిమా అంటే అది కచ్చితంగా రిస్కేమో కదా!