నితిన్ వరసగా భలే ప్రాజెక్టులను సెట్ చేస్తున్నాడుగా


Nithiin sets up five projects
Nithiin sets up five projects

యంగ్ హీరో నితిన్ దశాబ్దం తర్వాత హిట్లు అందుకుంటే ఇక అతనికి తిరుగులేదు అనుకున్నారు. అయితే రీసెంట్ గా నితిన్ చేసిన మూడు సినిమాలు లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం ప్లాప్ అవ్వడం తన కెరీర్ కు భారీ దెబ్బ. నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని ఎప్పటినుండో అనుకుంటున్న నితిన్ ను ఈ హ్యాట్రిక్ ప్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ మరే చిత్రాన్ని వెంటనే అంగీకరించలేదు. కొన్ని నెలలు విరామం తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో బోలెడన్ని కథలు విన్నాడు. అయితే ఫైనల్ గా నితిన్ ఛలో చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రాన్ని అంగీకరించాడు. అంతటితో ఆగిపోలేదు. వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. భీష్మ తర్వాత తొలిప్రేమ, mr మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేయడానికి తన అంగీకారం తెలిపాడు నితిన్. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఒకవైపు భీష్మ చేస్తూనే రంగ్ దే కు సంబంధించిన తొలి షెడ్యూల్ ను పూర్తి చేసాడు.

ఈ రెండు సినిమాలు కాకుండా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ చంద్రశేఖర్ యేలేటి దర్సకత్వంలో సినిమా చేయడానికి సైన్ చేసాడు. రంగ్ దే పూర్తవుతుండగానే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడు. ఇవన్నీ కాకుండా తన స్నేహితుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కూడా అంగీకారం తెలిపాడు. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది. 2020 చివర్లో కృష్ణ చైతన్య సినిమా పట్టాలెక్కవచ్చు.

ఇక లేటెస్ట్ గా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, బాలీవుడ్ లో సూపర్ హిట్టై నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న అందాధూన్ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. నితిన్ ఆయుష్మాన్ ఖురానా పాత్రను పోషించనున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, లాంటి విషయాలు ఏవీ ఇంకా తెలియలేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలుపెడతారో కూడా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది మొదలవ్వడం అయితే పక్కా. ఆయుష్మాన్ ఖురానాకి ఈ చిత్రంతో నేషనల్ అవార్డు కూడా రావడంతో నితిన్ ఆ పాత్రలో ఎలా చేస్తాడోనన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక భీష్మ విషయానికి వస్తే నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక,, నితిన్ కు బాస్ గా నటిస్తోన్న ఈ సినిమా మంచి ఫన్ ను జెనెరేట్ చేస్తుందని అంటున్నారు. వెంకీ కుడుముల మొదటి సినిమా ఛలో కూడా హిలేరియస్ గా సాగుతుంది. భీష్మలో కూడా అలాంటి ఎపిసోడ్స్ ను పెట్టినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలని భావించినా ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భీష్మాను నిర్మిస్తోంది.