నితిన్ ప్లాప్ సినిమా అక్కడ రఫ్ఫాడిస్తోంది


నితిన్ ప్లాప్ సినిమా అక్కడ రఫ్ఫాడిస్తోంది
నితిన్ ప్లాప్ సినిమా అక్కడ రఫ్ఫాడిస్తోంది

యంగ్ హీరో నితిన్ వరస ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రీసెంట్ గా వచ్చిన సినిమా భీష్మ. ఈ సినిమా నితిన్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దానికి ముందు నితిన్ నటించిన మూడు వరస పరాజయాలు పొందాయి. ఈ నేపథ్యంలో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన తరుణంలో వచ్చిన భీష్మ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అప్పుడు బయ్యర్లకు లాభాలు తీసుకురాగా ఇటీవలే డిజిటల్ రిలీజ్ లో కూడా దుమ్ములేపుతోంది. నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుండగా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో స్ట్రీమ్ మొదలైనప్పటి నుండి ట్రెండ్ అవుతోంది.

హిట్ అయిన సినిమాకు డిజిటల్ లో ఆదరణ దొరుకుతోంది అంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్లాప్ అయిన సినిమాకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతుండడమే విశేషం. అది కూడా మన భాషలో కాదు. హిందీ లో. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం తెలుగులో పెద్ద ప్లాప్. ఈ సినిమాను సీరియల్ అని క్రిటిక్స్ ఏకిపడేశారు. మంచి చెప్పాలనుకుని పెళ్లి మీద క్లాసులు పీకారని యూత్ కూడా ఈ సినిమాను ఆదరించలేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో శతమానం భవతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది.

అయితే ఈ సినిమా హిందీలో యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి రాగా నార్త్ ప్రేక్షకులు దీన్ని తెగ చూసేస్తున్నారు. విడుదలైన చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ ను చేరుకుంది. ఒక ప్లాప్ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడమంటే అది మాములు విషయం కాదు. అది కూడా డబ్ద్ వెర్షన్. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయిందని అర్ధమవుతోంది. అలాగే లాక్ డౌన్ కూడా ఈ వ్యూస్ రావడానికి సహకరించిందని చెప్పాలి.