వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన నితిన్


nitin lines up 3 movie releases in 8 months
nitin lines up 3 movie releases in 8 months

యంగ్ హీరో నితిన్ కెరీర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వస్తే హిట్లు లేదంటే ప్లాపులు.. ఏదైనా కానీ వరసగా వచ్చేస్తాయి. ఒక్కసారి హిట్ కొట్టడానికి దాని తర్వాత అన్నీ వరస హిట్సే. అదే ప్లాప్స్ ఇవ్వడం మొదలుపెడితే ఇక అవి కూడా అంతే. వరసగా వచ్చేస్తాయి. మరో హీరో అయితే నితిన్ కొట్టినన్ని ప్లాప్స్ కి ఈపాటికే ఎప్పుడో సైడ్ అయిపోయేవాడు. ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్ కి. అన్ని ప్లాపులు స్టార్ హీరోలు కూడా తట్టుకోలేరేమో. ఈరోజుల్లో వరసగా మూడు, నాలుగు ప్లాపులొస్తేనే సైడ్ అయిపోతున్నారు. అలాంటిది 14 ప్లాపులొచ్చి కూడా ఇంకా నితిన్ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇష్క్ తో మళ్ళీ కొట్టిన నితిన్ మళ్ళీ కొంత కాలం వెనక్కి తిరిగి చూసింది లేదు. హిట్స్ మీద హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ.. ఆ సినిమా కూడా చేసాడు. నితిన్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ చిత్రం.

ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది అన్న సమయంలో నితిన్ మళ్ళీ ప్లాపుల బాట పట్టాడు. ఒకటికి మూడు సినిమాలు, లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం.. ఇలా హ్యాట్రిక్ ప్లాపులు రాంగ్ టైమ్ లో ఇచ్చాడు. ఈ దెబ్బతో కెరీర్ ను ఏకంగా ఏడాదిన్నర పాటు పక్కనపెట్టేశాడు. సినిమాల నుండి కొంచెం టైమ్ తీసుకుని అసలు ఏం చేస్తున్నాడో సమీక్షించుకున్నాడు.

ఏడాది పాటు కనీసం ఒక్క కథ కూడా వినకుండా గడిపేశాడు. అందుకే ఈ ఏడాది నితిన్ నటించిన చిత్రమేదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఏడాదిన్నర తర్వాత నితిన్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ బిజీగా కాలం గడిపేయనున్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఎనిమిది నెలల కాలంలో మూడు సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది కాలంలో నాలుగు సినిమాలు.. అంటే నాలుగు నెలలకో సినిమా వచ్చేలా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నాడు.

నితిన్ ఇప్పుడు భీష్మ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ చిత్రం మొదట క్రిస్మస్ కు అనుకున్నా ఇప్పుడు ప్రేమికుల రోజున నాడు విడుదల కానుంది. భీష్మ తర్వాత ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన వెంకీ అట్లూరి చిత్రం రంగ్ దే సినిమాను పూర్తి చేస్తాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యేలా చూడాలని కోరాడు. దాని తర్వాత దసరాకి లేదా దీపావళికి నితిన్ తన తర్వాతి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. రంగ్ దే తర్వాత నితిన్ టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఇవి కాకుండా నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే చిత్రాన్ని కూడా మొదలుపెడతాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో ఆరంభమవుతుంది. ఇది రెండు చిత్రాల సిరీస్ గా రూపొందించాలని అనుకుంటున్నారు. ఈ రకంగా నితిన్ డైరీ 2019లో ఫుల్ బిజీగా ఉండనుంది.