సరిలేరులో తమన్నాది ఐటమ్ సాంగ్ కాదా?


No clarity about Tamanna in Sarileru Neekevvaru
No clarity about Tamanna in Sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఇండస్ట్రీలోనే కాక ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్ని చిత్రాల నుండి మహేష్ బాబు సటిల్ యాక్టింగ్ చేయడానికే మొగ్గు చూపడంతో మహేష్ ఫ్యాన్స్ లోనే ఒకలాంటి నిరాసక్త భావన కలిగింది. అది దృష్టిలో ఉంచుకునే అనిల్ రావిపూడి, మహేష్ కు జోవియల్ గా ఉండే కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మహేష్ బాబు రీసెంట్ గా కనిపించనంత యాక్టివ్ గా ఈ సినిమాలో ఉండబోతున్నాడు. పంచ్ డైలాగులు వేస్తూ, కామెడీ పండిస్తూ మహేష్ ఈ సినిమాలో చెలరేగిపోతాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ గురించి చాలా చర్చ నడుస్తోంది. వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ తరహాలోనే ఈ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ లోనే మహేష్ బాబు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడని, ఎంత అంచనాలు పెట్టుకుని వచ్చినా ఈ ఎపిసోడ్ కచ్చితంగా నవ్విస్తుందని టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా చెబుతోంది.

మరోవైపు కామెడీనే కాకుండా అనిల్ రావిపూడి అన్ని రకాలుగా ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ పంథాలో దర్శకుడు అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ప్రముఖ హీరోయిన్ తో ఒక స్పెషల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేసాడట. ఆమె తమన్నా అని వార్తలు కూడా వచ్చాయి. అనిల్ రావిపూడి, తమన్నాతో రీసెంట్ గా ఎఫ్ 2 ద్వారా బంపర్ హిట్ కొట్టాడు. సో అడిగిన వెంటనే కాదనకుండా తమన్నా ఈ సాంగ్ లో నర్తించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు నుండి ప్రతీ మండే ఒక అప్డేట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. తొలి పాటగా మైండ్ బ్లాక్ అని ఈరోజు సాయంత్రం విడుదల కాబోతోంది. అయితే తర్వాత మహేష్, తమన్నా కలిసి నర్తించిన స్పెషల్ సాంగ్ కూడా విడుదలవుతుందని అంటున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి పాట దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ అంటే స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు కాబట్టి సరిలేరు నీకెవ్వరులో ఎలాంటి పాట ఇవ్వబోతున్నాడోనని చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం స్పెషల్ సాంగ్ సంగతేమో కానీ ఈ చిత్రంలో తమన్నా అతిథి పాత్రలో కనిపించబోతోందని న్యూస్ బయటకు వచ్చింది. అనిల్ రావిపూడి లక్కీగా తమన్నాను ఫీల్ అవుతున్నాడని, అందుకే స్పెషల్ రోల్ లో ఆమెను తీసుకున్నాడని న్యూస్ వచ్చింది. అయితే స్పెషల్ సాంగ్ లో ఆమె ఉందా లేక అతిథి పాత్ర మాత్రమే వేసిందా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశమైతే ఉంది. తమన్నా ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదలవ్వనుంది.