మహేష్ వెబ్ సిరీస్ ల ఐడియా ఏమైంది?


No clarity on Mahesh web series
No clarity on Mahesh web series

సూపర్ స్టార్ మహేష్  బాబు ఇదివరకు సినిమాలే లోకంగా బ్రతికేవాడు. తన సినిమాలు తాను చేసుకోవడం తర్వాత తన పనేదో తను చూసుకోవడం అన్నట్లు ఉండేవాడు. అయితే నెమ్మదిగా యాడ్ లో కనిపించడం మొదలుపెట్టాడు మహేష్. ఇప్పుడు తను ఏకంగా 31 బ్రాండ్ ల వరకూ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ లిస్ట్ ఏడాదికేడాదికీ పెరుగుతూ పోతోంది.

ఇటీవలే మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు మహేష్. ఏషియన్ సినిమాస్ తో పార్ట్నర్ గా మారి మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరిట హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. అది దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకుంది. బెంగళూరులో కూడా ఒక మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతున్నాడు. అలాగే తన సొంత క్లోతింగ్ సంస్థ హంబుల్ ను ప్రారంభించాడు మహేష్. దానికి మైన్త్రతో టై అప్ అయ్యి బిజినెస్ చేస్తున్నాడు. ఇక మహేష్ నిర్మాణసంస్థ జిఎంబి ఉండనే ఉంది. తన సినిమాలకు తనే నిర్మాణభాగస్వామిగా మారుతున్నాడు.

వీటన్నిటికీ తోడు మహేష్ గతేడాది వెబ్ సిరీస్ ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు ఎంతో సన్నిహితంగా మెలిగే మెహర్ రమేష్ కు ఒక వెబ్ సిరీస్ కు సంబంధించి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. జగపతిబాబు ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని అన్నారు. అలాగే మీకు మీరే మాకు మేమే ఫేమ్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ‘ఛార్లీ’ అనే వెబ్ సిరీస్‌ను మహేష్ నిర్మించబోతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ కు అన్నీ సిద్ధమైపోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక షూటింగ్ కు వెళ్లడమే ఆలస్యమన్నట్లుగా మాట్లాడారు. అయితే ఈ రెండు వార్తలు వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. అసలు ఈ రెండు వెబ్ సిరీస్ లు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయా లేక పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయా లేక అసలు మొదలే కాలేదా అన్నదానిపై వివరణ లేదు.