అక్కడ కరోనా అయితే, ఇక్కడ ప్రభాస్ – తగ్గేది లేదు

అక్కడ కరోనా అయితే, ఇక్కడ ప్రభాస్ –  తగ్గేది లేదు
అక్కడ కరోనా అయితే, ఇక్కడ ప్రభాస్ – తగ్గేది లేదు

“ఇల్లేమో దూరం.. అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు..చేతిలో దీపం లేదు; కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నా కవచం.” మహా కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన వాక్యాలు ఇవి. సినిమా వాళ్లకు భయం వేసినప్పుడల్లా.. ఇలాంటి సూక్తులు గుర్తుతెచ్చుకొని తమకు తాము ధైర్యం చెప్పుకొని పని చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమా అనేది కొన్ని కోట్ల మంది ప్రేక్షకులతో అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయల డబ్బులతో ముడిపడిన వ్యవహారం.

కాబట్టి కొన్నిసార్లు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు వచ్చినా.. షూటింగ్ వాయిదా వేయడం సాధ్యపడదు. ప్రభాస్ కథానాయకుడిగా “జిల్” సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.

సాహో సినిమా తర్వాత ఈ సినిమాకు సంబంధించిన “బజ్” తమకు తెలియజేయడం లేదు..! అంటూ ప్రభాస్ అభిమానులు యు.వి.క్రియేషన్స్ మీద ఫైర్ అయిన నేపథ్యంలో స్వయంగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు షూటింగ్ వివరాలను మరియు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల భాషలలో అన్ని రకాల ఇండస్ట్రీలలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ లు వాయిదా వేశారు. ఇప్పటికే జరుగుతున్న షెడ్యూల్స్ ను కూడా రీ షెడ్యూల్ చేశారు. కాకపోతే ఇప్పుడు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో సంచలనంగా మారింది. సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ లో తీసిన ఒక ఫోటో ని రాధాకృష్ణ అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటో సినిమా షూటింగ్ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్.

“10 డిగ్రీల ఉష్ణోగ్రత విపరీతమైన చలి కుండపోతగా కురుస్తున్న వాన కరోనా వైరస్ భయం అనుకూలించని పరిస్థితులు ఇవేవీ మా టీం కు పెద్ద అడ్డంకి కాదు. ఏదీ మమ్మల్ని ఆపలేదు.” అని చాలా ఉత్సాహంగా అభిమానులతో పంచుకున్నారు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు మొదట పరిశీలించిన “జాను” అనే టైటిల్ ను దిల్ రాజు “96” రీమేక్ సినిమాకు ప్రభాస్ ఔదార్యంగా ఇచ్చేసిన నేపథ్యంలో.. ఈ సినిమాకు “ఓ డియర్”, “రాధేశ్యామ్” ఈ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.