దిల్ రాజు ఈ సినిమాను పూర్తిగా పక్కనపెట్టేశాడేంటి?No promotions for Iddari Lokam Okate post release
No promotions for Iddari Lokam Okate post release

దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలుంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు, కనీస స్థాయి ఎంటర్టైన్మెంట్ ఆశించే సినిమాలు దిల్ రాజు బ్రాండ్ నుండి వస్తుంటాయి. దిల్ సినిమాతో నిర్మాతగా పరిచయమైన రాజు, చాలా తక్కువ కాలంలోనే దిల్ రాజు అనే బ్రాండ్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పరుచుకున్నాడు. చాలా తక్కువ మంది నిర్మాతల్ని పేరు చూసి సినిమాలకు వస్తుంటారు. వాళ్లలో దిల్ రాజు కూడా ఒకరు. అయితే ఈ మధ్య ఆ బ్రాండ్ నేమ్ మసకబారిందనేలా విడుదలైన కొన్ని సినిమాలు ఆశించిన రేంజ్ లో ఆడలేదు. ఇటీవలే విడుదలైన ఇద్దరి లోకం ఒకటే సినిమా అయితే ఇది అసలు దిల్ రాజు సినిమానేనా అన్న సందేహాలు కలిగించింది.

దిల్ రాజు అంటే ఉండే కనీస స్థాయి ప్రమాణాలు కూడా ఈ చిత్రానికి లేవు. చెప్పుకోవడానికంటూ ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేకపోవడం గమనార్హం. అటు ఇండస్ట్రీ, ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా దిల్ రాజు నుండి ఇటువంటి సినిమాను ఊహించలేదు. అందుకే ప్రేక్షకులు తొలి ఆట నుండే దీన్ని తిరస్కరించారు. అయితే సినిమా అన్నాక మినిమం ప్రమోషన్లు చేయడం పరిపాటి. సినిమా విడుదలైన సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి తక్కువ రేటింగ్స్ ఇస్తూ రివ్యూలు రాసే వాళ్ళని చెడమెడ తిట్టేయడం పరిపాటిగా మారింది.

అయితే ఇద్దరి లోకం ఒకటే విషయంలో ఇలాంటిదేం జరగలేదు. సినిమా విడుదలకు ముందే ప్రమోషన్లు చాలా తక్కువ స్థాయిలో జరిగాయి. కనీస స్థాయిలో టివిలో యాడ్ లు వేయలేదు. పేపర్స్ లో ప్రింట్స్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా హడావిడి తక్కువే. ఇక రిలీజ్ అయ్యాక అవి పూర్తిగా తగ్గిపోయాయి. ఒకవైపు వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, మత్తు వదలరా వంటి సినిమాలు జోరు చూపిస్తుంటే పోటీ తట్టుకోవడం కోసమైనా కనీసం ఏదొకటి చెప్పి దిల్ రాజు సినిమా ప్రమోట్ చేయవచ్చు కానీ ఆ రూట్ ను అతను ఎంచుకోలేదు. ఓటమిని ఒప్పుకున్నట్లున్నాడు. అందుకే ఏం చెప్పి సినిమాను చూడమనాలో తెలియక సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దిల్ రాజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.