బన్నీ – సుక్కూ సినిమాకు అడ్డంకి ఏంటి?


బన్నీ - సుక్కూ సినిమాకు అడ్డంకి ఏంటి?
బన్నీ – సుక్కూ సినిమాకు అడ్డంకి ఏంటి?

2018 మార్చ్ నెలాఖరులో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో. రామ్ చరణ్ కు ఎంత పేరు తీసుకొచ్చిందో మనందరం చూసాం. మరో 40 రోజుల్లో ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అయితే రెండేళ్లు అవుతున్నా ఇంకా సుకుమార్ నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా మొదలుకాకపోవడమే ఆశ్చర్యకర విషయం. రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చినా కూడా సుకుమార్ తన తర్వాతి సినిమా విషయంలో ఇంతలా స్ట్రగుల్ అవ్వడం పలువురిని విస్మయపరిచింది. అయితే చాలా నాటకీయ పరిణామాల తర్వాత సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ హీరోగా ఫిక్స్ చేసుకున్న విషయం తెల్సిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. గత డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు. అప్పటికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ పూర్తి చేసేసాడు కూడా.

అయితే డిసెంబర్ తర్వాత అల వైకుంఠపురములో ప్రమోషన్స్ తో బన్నీ బిజీ అయిపోయాడు. పోనీ సినిమా విడుదలయ్యాక షూటింగ్ మొదలవుతుందా అంటే అవ్వలేదు. ఈ సినిమాలో పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఫిబ్రవరి మొదటి వారం నుండి షూటింగ్ ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి చివరికి వచ్చేసింది కానీ షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. మార్చ్ మొదటి వారం అంటున్నారు కానీ మార్చ్ నెలాఖరుకు మారుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

ఇప్పటిదాకా కేరళ వెళ్లి ఒక నాలుగు రోజులు ట్రయిల్ షూట్ చేయడం మినహా ఎటువంటి పురోగతి లేదు. కేరళ అడవుల్లో దాదాపు రెండు నెలల షెడ్యూల్ ఉంది. సమ్మర్ దాటిందంటే అక్కడ వర్షాలు మొదలై షూటింగ్ చేసుకోవడానికి వీలు పడదు. ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ లో షూటింగ్ మొదలవ్వాలి. మరి కారణాలు ఏంటో తెలియట్లేదు కానీ షూటింగ్ స్టార్ట్ చేయడంలో జాప్యం మాత్రం జరుగుతోంది. మరి చూద్దాం బన్నీ – సుకుమార్ సినిమా షూటింగ్ మొత్తానికి ఎప్పుడు మొదలవుతుందో.