త్రివిక్రమ్, వెంకీ ఇప్పట్లో లేనట్లేనా??


త్రివిక్రమ్, వెంకీ ఇప్పట్లో లేనట్లేనా??
త్రివిక్రమ్, వెంకీ ఇప్పట్లో లేనట్లేనా??

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఉన్నప్పటి నుండి తన ప్రధాన ఎమోషన్ ఎప్పుడూ కామెడీ మీదే ఉండేది. తనదైన శైలి ప్రాసలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కడుపుబ్బా నవ్వించేవాడు. దర్శకుడిగా మారాక కూడా త్రివిక్రమ్ దృష్టి ఎక్కువగా కామెడీ మీదే ఉంది. మొదటి సినిమా నువ్వే నువ్వే నుండి ప్రస్తుతం చేస్తోన్న అల వైకుంఠపురములో వరకూ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎక్కువగా లైట్ హార్టెడ్ కామెడీ బేస్డ్ గానే ఉంటూ వస్తున్నాయి. జోనర్ ఏదైనా త్రివిక్రమ్ సినిమాలు ప్రధానంగా కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గానే నడుస్తుంటాయి. మరోవైపు విక్టరీ వెంకటేష్ అనగానే మొదట గుర్తొచ్చేది కామెడీనే. తనపైనే పంచ్ లు వేయించుకుంటూ 90ల కాలంలో వెంకీ కామెడీను తలుచుకుని ప్రేక్షకులు ఇప్పటికీ నవ్వుకుంటారు.

అందుకే వీరిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు మరింత ఎగ్జైట్ అయ్యారు. వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాల పేర్లు చెప్పగానే ఇప్పటికీ ప్రేక్షకులకు దర్శకుడి కంటే కూడా ముందు త్రివిక్రమ్ పేరే గుర్తొస్తుంది. అంతలా ఆ సినిమాలపై త్రివిక్రమ్ ముద్ర వేసాడు. ఇక అప్పట్లో వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా అవకాశం ఇద్దామని ప్రయత్నించాడు. అయితే వివిధ కారణాల వల్ల అది కుదర్లేదు. తర్వాత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోయారు.

అయితే మళ్ళీ రెండేళ్ల నుండీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గురించి వార్తలు రావడం మొదలయ్యాయి. ఎఫ్ 2 తర్వాత వెంకటేష్ మాట్లాడుతూ మంచి కథతో వస్తే తప్పకుండా త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని చెప్పాడు. త్రివిక్రమ్ కూడా త్వరలో సినిమా ఉండొచ్చంటూ సంకేతాలిచ్చాడు. ఈ నేపథ్యంలో ఎఫ్ 2 తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంకటేష్ వెంకీ మామ సినిమాను మొదలుపెట్టాడు. అలాగే త్రివిక్రమ్ బన్నీతో అల వైకుంఠపురములో చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదలకు దగ్గర్లో ఉన్నాయి. వెంకీ మామ డిసెంబర్ 13న విడుదలవుతుంటే, అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కానుంది. పోనీ ఈ సినిమా తర్వాతైనా ఈ సినిమా ఉంటుందా అంటే అది జరిగేలా కనిపించట్లేదు.

ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒక యంగ్ హీరోతో సినిమా చేయనున్నాడు. తర్వాత అతనికి చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. వెంకీ కూడా ఇప్పుడు అసురన్ రీమేక్ లో నటించడానికి సమాయత్తమవుతున్నాడు. దీని తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయాలి. మరో యువ దర్శకుడు కూడా వెంకీకు లైన్ వినిపించాడు. అది ఓకే అయితే ఆ సినిమా కూడా క్యూ లో ఉంటుంది. తనతో గురు సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమా ఉండే అవకాశముంది. ఇంకా పలు కథలను వింటున్నాడు. ఇలా ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోతున్న తరుణంలో ఈ కాంబోలో సినిమా ఇప్పట్లో లేనట్లే అనుకోవచ్చు.