ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించేది ఈమే!


NTR heroine announced for RRR
NTR heroine announced for RRR

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా వివిధ రకాల వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం సాగడం లేదని, మధ్యలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ఒకరితర్వాత ఒకరికి గాయాలవ్వడం, తర్వాత రామ్ చరణ్ సైరా సినిమా షూటింగ్ తో బిజీగా మారిపోవడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆలస్యమైందని, ముందే రాజమౌళి చెప్పినట్లు జులై 30, 2020న ఈ చిత్రం విడుదలవ్వడం అసాధ్యమని పేర్కొన్నారు. దీంతో పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ గా ఒక విదేశీ నటిని ఎంపిక చేయగా ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు ఈ రోల్ కోసం రాజమౌళి అండ్ కో తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎంత మాత్రం విదేశీ నటి ఎవరూ సెట్ అవ్వట్లేదని, బాహుబలి లాంటి గొప్ప సినిమా అందించిన దర్శకుడికి ఈ తిప్పలు ఏంటి అంటూ కథనాలు వచ్చాయి. ఈ రెండిటికీ నిన్న ఒకే ట్వీట్ తో సమాధానం చెప్పారు ఆర్ ఆర్ ఆర్ టీమ్.

షూటింగ్ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిందని, సినిమా మొదలైన ఏడాదికి ఇంత బాగా షూటింగ్ జరిగినందుకు తాము చాలా ఆనందిస్తున్నామని ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పష్టం చేసింది. దాంతో పాటు ఎన్టీఆర్ హీరోయిన్ పేరు కూడా రేపు ప్రకటిస్తాం అని నిన్న పేర్కొన్నారు. అనుకున్న ప్రకారమే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆ విదేశీ నటి ఎవరో ప్రకటించారు. ఆ హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ను ఎంపిక చేసారు. దాంతో పాటు “ఒలీవియా మోరిస్ కు స్వాగతం. మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాం. ఈ చిత్రంలో మీరు జెన్నిఫర్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము” అని ప్రకటించారు.

త్వరలో ఒలీవియా – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సీన్లను రాజమౌళి షూట్ చేయనున్నారు. మిగిలిన 30 శాతం షూటింగ్ ఈమె భాగమే ఎక్కువ మిగిలిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇక హీరోయిన్ గురించి అప్డేట్ వచ్చేసింది కాబట్టి అన్ని రకాల రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడిపోయినట్లే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో పాత్ర ప్రకారం బలశాలిగా కనిపించాలి కాబట్టి విదేశీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాడు. చరణ్, ఎన్టీఆర్ పాత్రలు అటు శక్తిమంతంగా ఉంటూనే ఎమోషనల్ కూడా చేస్తాయని చెబుతున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు అందించారు. ఇంకా ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెల్సిందే. అలియా భట్ చరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది.