రామ‌రాజు వ‌చ్చేశాడు.. ఎన్టీఆర్ గిఫ్ట్‌ అద‌రింది!


రామ‌రాజు వ‌చ్చేశాడు.. ఎన్టీఆర్ గిఫ్ట్‌ అద‌రింది!
రామ‌రాజు వ‌చ్చేశాడు.. ఎన్టీఆర్ గిఫ్ట్‌ అద‌రింది!

రామ్‌చ‌రణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై యావ‌త్ దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ కోసం ఎదురుచూసిన ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు ఉగాది రోజున టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్ని రిలీజ్ చేసి చిత్ర బృందం స‌ర్‌ప్రైజ్ ఇచ్చేసింది.

శుక్ర‌వారం హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ పుట్టిన‌రోజు కావ‌డంతో ఈ సంద‌ర్భంగా `ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఉద‌యం 10 గంట‌ల‌కే స‌ర్‌ప్రైజ్ అన్నారు. కానీ టెక్నిక‌ల్ కార‌ణాల వ‌ల్ల సాయంత్రం 4 గంట‌ల‌కు వాయిదా వేశారు. రాజ‌మౌళి ఫైన‌ల్ చేసిన త‌రువాత రామ్‌చ‌ర‌ణ్‌కు సంబంధించిన రామ‌రాజు లుక్‌కి సంబంధించిన వీడియో టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు.

ఈ టీజ‌ర్‌లో రామ‌రాజుని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ని కొమ‌రం భీం (ఎన్టీఆర్‌)కు అప్ప‌గించిన‌ట్టుంది. ఆరు ప‌ల‌క‌ల దేహాన్ని త‌ల‌పించే శ‌రీర శౌష్ట‌వం.. మొడ‌లో ఓం.. య‌జ్ఞోప‌వేతం..తో క‌నిపించి క‌నిపించ‌కుండా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తున్న స‌న్నివేశాల‌తో వీడియో మొద‌లైంది.  `ఆడు క‌న‌బ‌డితే నిప్ప‌క‌ణం న‌ల‌బ‌డిన‌ట్టుంటది… (రామ్ చ‌ర‌ణ్ క‌ర్ర‌సాము విన్యాసాలు…).. క‌ల‌బ‌డితే యేగుసుక్క ఎగ‌బ‌డిన‌ట్టుంట‌దీ.. ఎదురుబ‌డితే సావుకైనా సెమ్ట‌ దార‌గ‌డ‌త‌ది. బాణ‌మైనా.. బందూకైనా వాణికి బాంచ‌నైత‌ది… ఇంటిపేరు అల్లూరి…సాకింది గోదారి…నా అన్న మ‌న్నెందొర అల్లూరి సీతారామ‌రాజు..` అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చిన తీరు అద‌రిపోయింది.

టీజ‌ర్ వీడియోలో రామ్‌చ‌ర‌ణ్‌ని చూపించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని స్కై హైకి చేరుస్తోంది. వేట‌కి సిద్ధ‌మ‌వుతున్న బెబ్బులిలా చ‌ర‌ణ్ ఈ వీడియో టీజ‌ర్‌లో క‌నిపిస్తున్నాడు. కొమ‌రం భీం, అల్లూరి సీతారామ‌రాజు ఇద్ద‌రూ అన్నాద‌మ్ముల త‌ర‌హాలో ఒక‌రంటే ఒక‌రికి అభిమానం వున్న వ్య‌క్తుల్లా క‌నిపించ‌బోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ వాయిస్‌లో నా అన్న.. అన్న వాయిస్ ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న `బాహుబ‌లి` రికార్డులు తిర‌గ‌రాసేలా క‌నిపిస్తోంది.