పలాస 1978 మూవీ రివ్యూ

పలాస 1978 మూవీ రివ్యూ
పలాస 1978 మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: పలాస 1978
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, లక్ష్మణ్ తదితరులు
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
సంగీతం: రఘు కుంచె
విడుదల తేదీ: మార్చ్ 6, 2020
రేటింగ్: 2.75/5

ట్రైలర్ తోనే ఆసక్తి రేకెత్తించిన సినిమా పలాస 1978. సాధారణంగా ఒక ఊరి కథను బేస్ చేసుకుని మనకు వచ్చిన సినిమాలు తక్కువ. అందులోనూ పలాస 1978లో ఒక రస్టిక్ ఫీల్ కనిపించింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆకర్షితులయ్యారు. అల్లు అరవింద్ వంటి నిర్మాత సినిమా విడుదలకు ముందే ఈ చిత్ర దర్శకుడికి ఆఫర్ ఇవ్వడంతో చిత్రంపై బజ్ పెరిగింది. మరి ఈరోజు విడుదలైన చిత్ర రివ్యూ ఎలా ఉందో చూద్దామా.

కథ:
ముందే చెప్పుకున్నట్లు ఇది పలాస అనే ఊర్లో 1970ల కాలం నాటి కథ. అప్పట్లో అక్కడి పరిస్థితులు, కులం తగాదాలు, ఎక్కువ కులం, తక్కువ కులం మధ్య వ్యత్యాసాలు, అంటరానితనం.. వంటి వాటి మీద బేస్ అయిన సినిమా. క్లుప్తంగా చెప్పాలంటే పలాస అనే ఊర్లో మోహన (రక్షిత్), రంగ అనే ఇద్దరు తక్కువ కులం అన్నదమ్ములకు, షావుకారు, చిన్నషావుకారు (రఘు కుంచె) అనే ఎక్కువ కులం అన్నదమ్ములకు మధ్య తేడా వస్తుంది. ఆ తేడా ఎటువైపు దారి తీసింది. రక్త సంబంధం కంటే డబ్బు, పవర్ అనేవి మనుషులకు ఎందుకు ప్రీతిపాత్రమయ్యాయి వంటివి ఈ చిత్రంలో చూపించారు.

నటీనటులు:
లండన్ బాబులు చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రక్షిత్ ఈ సినిమాతో పూర్తి మేకోవర్ కు వెళ్ళాడు. తన లుక్ ను పూర్తిగా మార్చేయడమే కాదు పెర్ఫార్మన్స్ పరంగా కూడా మెప్పించాడు. ఉన్నంతలో బాగా చేసాడు రక్షిత్. ఎమోషనల్ సీన్లు కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ మెప్పించాడు. తన అన్నగా చేసిన వ్యక్తి కూడా నటనాపరంగా అబ్బురపరిచాడు. ఇక రఘు కుంచె కూడా తొలిసారి అయినా విలనిజాన్ని పండించడంలో సక్సెస్ అయ్యాడు. లక్ష్మణ్, పోలీస్ ఆఫీసర్ గా నటించిన వ్యక్తి కూడా మెప్పిస్తారు. హీరోయిన్ నక్షత్ర కూడా ఉన్నంతలో బాగా చేసింది.

సాంకేతిక వర్గం:
రఘు కుంచె అందించిన సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. జానపద పాటలను ఈ చిత్రంలో బాగా ప్లేస్ చేసారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అప్పటి కాలం నాటి సెటప్ ను బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సినిమా స్లో అయిన భావన కలుగుతుంది.

కరుణ కుమార్.. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అంటూ నాలుగు విభాగాలను హ్యాండిల్ చేసాడు. ఇందులో కథ రొటీన్. స్క్రీన్ ప్లే విషయంలో కూడా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. ఇక డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా మెప్పిస్తుంది. హీరోయిజం ఎలివేషన్ సీన్లు కూడా ఎమోషనల్ సీన్లు కానీ బాగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

విశ్లేషణ:
పలాస 1978లో కొత్తగా చెప్పుకునే పాయింట్ ఏం లేదు. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో మనం చూసిన రొటీన్ రివెంజ్ ప్లాట్ ఇందులో కూడా ఉంది. అయితే ఒక రస్టిక్ ఫీల్ తీసుకురావడంలో, అంతేంటిక్ భావన కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ తో సంతృప్తి పడినా సెకండ్ హాఫ్ మరీ నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. అయితే మైనస్ లను పక్కనపెడితే పలాస 1978లో ప్రేక్షకులను అలరించే అంశాలకు ఢోకా లేదు. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా.