పవన్ గెడ్డం గీసుకోడు.. మిగతా అంతా సేమ్ టు సేమ్


పవన్ గెడ్డం గీసుకోడు.. మిగతా అంతా సేమ్ టు సేమ్
పవన్ గెడ్డం గీసుకోడు.. మిగతా అంతా సేమ్ టు సేమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మొత్తానికి కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోయినా, నిర్మాత దిల్ రాజు ఎక్కడా ఈ విషయంపై డైరెక్ట్ గా నోరు విప్పకపోయినా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటించనున్నాడన్న విషయం కన్ఫర్మ్ అయినట్లే. అసలు సినిమాలు చేయనని భీష్మించుకుని కూర్చున్న పవన్ మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు. పింక్ రీమేక్ ను నిర్మిస్తున్న దిల్ రాజు, పవన్ కళ్యాణ్ నుండి 21 రోజుల కాల్స్ షీట్స్ మాత్రమే అడిగినట్లు సమాచారం. 21 రోజుల కాల్ షీట్స్ కోసం ఏకంగా 50 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. పింక్ రీమేక్ జనవరి లేదా ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో నటించే ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా మల్లేశం సినిమాలో నటించి అందరినీ మెప్పించిన అనన్య నాగళ్ళ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలిలను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం పవన్ గెడ్డం గీసుకోడట. గెడ్డం లుక్ లోనే పింక్ రీమేక్ లో లాయర్ పాత్రలో నటించనున్నాడట. పవన్ రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గరనుండి ఎక్కువగా గెడ్డంలోనే కనిపిస్తున్నాడు. అందులోనూ గుబురు గెడ్డం లుక్ లో మీటింగ్స్ కు హాజరవుతున్నాడు. పింక్ రెండు భాషల్లో తెరకెక్కగా రెండిట్లో ప్రధాన పాత్రలు పోషించిన అమితాబ్, అజిత్ కూడా తెల్ల గెడ్డంతో కనిపించారు. అయితే పవన్ బయట లుక్ తరహాలోనే నల్లటి గెడ్డంతోనే ఈ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

దానికి తోడు ఈ సినిమాలో పవన్ కు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కూడా యాడ్ చేయనున్నారు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ఎలాంటి లుక్ అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విషయం తెల్సిందే. థమన్ ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.