పవర్ స్టార్ మళ్ళీ పాటేసుకుంటున్నాడా?


పవర్ స్టార్ మళ్ళీ పాటేసుకుంటున్నాడా?
పవర్ స్టార్ మళ్ళీ పాటేసుకుంటున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ అంటే అల్లాటప్పాగా ఇవ్వట్లేదు. ఏదో మొక్కుబడిగా సినిమాలను చుట్టేయాలని అనుకోవట్లేదు. ఇదివరకు జనాలను ఎంటర్టైన్ చేయడానికి ఏమేం చేసాడో అవన్నీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి అంతకంటే ఎక్కువే చేస్తున్నాడని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడూ ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా అంటూనే వెళ్ళాడు. ఎప్పుడూ కూడా రెండు సినిమాల షూటింగ్స్ ను ఒకేసారి చేసింది లేదు. అయితే ఈసారి రెండు సినిమాలను చేయడమే కాదు మూడో సినిమాను ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంచాడు. మరో రెండు, మూడు నెలల్లో ఆ సినిమా కూడా మొదలైపోతుంది. ఇక నాలుగో సినిమా కోసం పలు కథల్ని వింటున్నాడు పవన్. తమ అభిమాన హీరోలో ఇంత వేగం చూసి ఆయన అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ఆనందంలో తేలిపోతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే పింక్ రీమేక్ తో పాటు క్రిష్ తో పీరియాడిక్ చిత్రంలో కూడా నటిస్తున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ చిత్రంలో పాట పడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు పాటలు పాడటం కొత్తేమి కాదు. జానీ సినిమాలో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పవన్ తన గాత్రాన్ని సరిచేసాడు. ఇప్పుడు మరోసారి తన గొంతును వినిపించనున్నాడు. అయితే అది ఎలాంటి పాట అన్నది ఇంకా తెలియలేదు. క్రిష్ పవన్ కళ్యాణ్ ముందు ఈ విషయాన్నీ తెలియజేస్తే దానికి పవన్ సముఖంగా స్పందించినట్లు చెబుతున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. సిరివెన్నెల ఈ చిత్రంలో ప్రధాన పాటలు రాయబోతున్నట్లు సమాచారం.

ఇంకా ఈ చిత్రానికి హీరోయిన్ వేట పూర్తవ్వలేదు. పూజ హెగ్డే తో పాటు పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. సాహోలో బ్యాడ్ బాయ్ సాంగ్ లో మెరిసిన జాక్వలైన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఎదురు చూడాలి.