ప‌వ‌ర్‌స్టార్ పారితోషికం తీసుకోవ‌ట్లేదా?Pawankalyan didn't take any remmunaration for Pink Remake
Pawankalyan didn’t take any remmunaration for Pink Remake

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల‌కు మించి క‌లెక్ష‌న్‌ల‌ని సాధించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. దిల్ రాజుతో క‌లిసి అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రానికి హీరో మ‌హేష్ కూడా ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హిరించారు. దాంతో ఈ సినిమాకు ఆయ‌న పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటాని మాత్ర‌మే తీసుకున్నార‌ట‌.

ఇప్పుడు ఇదే ప‌ద్ద‌తిని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుస‌రిస్తున్నార‌ని తెలిసింది. `అజ్ఞాత‌వాసి` ఫ‌లితం నిరాశ ప‌న‌ర‌చ‌డం, అప్పుడే ఏపీ ఎన్నిక‌లు స‌మీపించ‌డంతో సినిమాకు బ్రేకిచ్చిన ప‌వ‌న్ క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి సినిమాల‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌ళ్లీ యాక్ష‌న్ మోడ్‌లోకి వ‌చ్చేశారు. హిందీలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `పింక్‌` ఆధారంగా తెలుగులో ఓ సినిమా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే మొద‌లైంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌పైకొస్తున్న ఈ చిత్రానికి ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట‌. వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకోబోతున్నార‌ని, అందుకే చిత్ర నిర్మాత‌ల నుంచి ఇంత వ‌ర‌కు డ‌బ్బులు తీసుకోలేద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే ప‌వ‌న్‌కు ఈ సినిమా ద్వారా దాదాపు 50 కోట్లు అందే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.