పోలీసులపై పూల వర్షం, కేసీఆర్, సజ్జనార్ పై ప్రశంసల వర్షం

పోలీసులపై పూల వర్షం, కేసీఆర్, సజ్జనార్ పై ప్రశంసల వర్షం
పోలీసులపై పూల వర్షం, కేసీఆర్, సజ్జనార్ పై ప్రశంసల వర్షం

ఎక్కడైనా ఉదయం లేవగానే చావు వార్త వింటే ప్రజలు బాధపడతారు. పొద్దున్నే ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందేంటనే అనుకుంటారు. కానీ ఈరోజు నలుగురి మరణ వార్త విన్న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ఆనందించింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఆ మరణాలని ఆస్వాదించారు. న్యాయం జరిగిందని సంబరాలు చేసుకున్నారు. ‘దిశ’ హత్యాచార దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురూ ఈరోజు ఉదయం ఎన్ కౌంటర్ లో మరణించడంతో అందరూ ఆనందించారు. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిందితులను ఉదంతం జరిగిన ఘటనకు తీసుకెళ్లగా, నలుగురూ అక్కడినుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో చేసేదేం లేక పోలీసులు వారిపై కాల్పులు జరుపగా నలుగురూ అక్కడికక్కడే మరణించారు.

ఎన్ కౌంటర్ వార్త గురించి తెలుసుకున్న ప్రజలు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులపై పూల వర్షం కురిపించారు. ఈ ఒక్క సంఘటన ప్రజల్లో వారిపై ఉన్న ఆగ్రహావేశాలను తెలియజేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్టేషన్ ను చుట్టుముట్టి నిందితులను తమకు అప్పగించమని, తామే శిక్షిస్తామని నినాదాలు చేసిన ప్రజలు, ఇప్పుడు ఆనందంతో ఉన్నారు. చివరికి ఇలాగైనా న్యాయం జరిగిందని సంతోషిస్తున్నారు. జయహో పోలీస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ ఘటనపై వస్తున్న షేర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులకు, ప్రజల్ని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. ఇప్పటిదాకా ఈ ఎన్ కౌంటర్ పై ఒక్క నెగటివ్ మాట కూడా బయటకు రాకపోవడం విశేషం. దిశ తల్లిదండ్రులు తమకు న్యాయం చేసినందుకు పోలీసులకు కృతఙ్ఞతలు చెప్పారు.

ఇక ఈ విషయంలో కేసీఆర్ ను కూడా అందరూ అభినందిస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం అంటూ కేసీఆర్ ను పొగిడేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ ఎన్ కౌంటర్ చేయించాడని వార్తలు గుప్పుమనడంతో ఈ ఇద్దరికీ హ్యాట్సాఫ్ చెబుతూ ప్రజలు సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు కొడుతున్నారు.

నిజానికి కేసీఆర్ పై గత కొంత కాలంగా నెగటివిటీ పేరుకుపోయింది. 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన దగ్గరనుండి కేసీఆర్ నియంతలా పాలిస్తున్నాడంటూ పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. వివిధ అంశాలతో పాటు, ఆర్టీసీ సమ్మె సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. దిశ హత్యాచార ఘటన తర్వాత సీఎం, హోమ్ మినిస్టర్ సరిగ్గా స్పందించలేదన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ హత్యాచార నిందితులను ఊరికే వదలమని, ఆడ బిడ్డ వైపు తప్పుగా చూస్తే ఉచ్చ పడేలా చేస్తామని కేసీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్లే ఇప్పుడు నిందితులు ఎన్ కౌంటర్ కావడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ అందరి దృష్టిలో హీరో అయ్యారనే చెప్పాలి.