పూజ హెగ్డేకు ఇక ఎదురే లేదా?


pooja hegde success streak continues with ala vaikunthapurramuloo
pooja hegde success streak continues with ala vaikunthapurramuloo

తెలుగు పరిశ్రమలో ఇప్పుడు హీరోయిన్ల కొరత బాగా ఉంది. స్టార్ హీరోలకు హీరోయిన్లు కావాలి. కాజల్, తమన్నా, అనుష్క, రకుల్ ప్రీత్ లాంటి వారందరూ జోరు తగ్గించేశారు. ఈ నేపథ్యంలో పూజ హెగ్డే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ ను చేరుకునేలా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న వాక్క్యూమ్ ను ఫీల్ చేయడానికి పూజ హెగ్డే ఉత్సాహంగా కనిపిస్తోంది.

రీసెంట్ గా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన అల వైకుంఠపురములో ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. దీంతో పూజ హెగ్డే ఆనందానికి అవధుల్లేవు. అసలు ప్లాపుల్లో ఉన్నప్పుడే పూజ హెగ్డేకు అవకాశాల కొరత రాలేదు. ఇక ఇప్పుడు సూపర్ సక్సెస్ లలో కొనసాగుతోంది. టాప్ హీరోల సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది పూజ. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోగలగడం ఆమెకున్న మరో ప్రధాన ప్లస్ పాయింట్.

పూజ హెగ్డే కెరీర్ లో మొదట అన్నీ ప్లాపులే వచ్చాయి. ముకుంద, ఒక లైలా కోసం చిత్రాలు ప్లాప్, యావరేజ్ గా నిలిచాయి. తర్వాత బాలీవుడ్ లో చేసిన మోహెన్ జోదారో కూడా పెద్ద ప్లాప్. ఆ తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూ చేసిన దువ్వాడ జగన్నాథం కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మధ్యలో రంగస్థలం సినిమాలో చేసిన జిగేలు రాణి సాంగ్ ఒక ఆమెకు ప్లస్ కాగా మళ్ళీ బెల్లంకొండ బాబుతో చేసిన సాక్ష్యం చేదు ఫలితాన్నే మిగిల్చింది.

అయినా కానీ పూజ హెగ్డేకు అవకాశాలు తగ్గలేదు. సాధారణంగా హీరోయిన్లు వరసగా ప్లాపులు ఇస్తుంటే ఆమెను సైడ్ చేసేస్తారు కానీ పూజ విషయంలో అది జరగలేదు. అరవింద సమేత చిత్రంలో ఆమె భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత చేసిన మహర్షి కూడా పెద్ద విజయమే సాధించింది. ఇక గద్దలకొండ గణేష్ సినిమాలో చిన్న పాత్రే వేసినా కానీ ఆమె గ్లామర్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. ఇక రీసెంట్ గా అల వైకుంఠపురములో వంతు.

ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడే వరస అవకాశాలను అందుకున్న పూజ ఇప్పుడు హిట్ల మీద హిట్లు ఇస్తున్న తరుణంలో ఆమె కెరీర్ ఎటువంటి టర్న్ తీసుకుంటుందోనన్న అంచనాలు ఎక్కువయ్యాయి.