`ప‌వ‌ర్‌స్టార్` మూవీ రివ్యూ

`ప‌వ‌ర్‌స్టార్` మూవీ రివ్యూ
`ప‌వ‌ర్‌స్టార్` మూవీ రివ్యూ

న‌టీన‌టులు : ప‌్ర‌వ‌న్ క‌ల్యాణ్‌
నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం : ‌రామ్ గోపాల్ వ‌ర్మ‌
సంగీతం:  డి.ఎస్‌. ఆర్‌
సినిమాటోగ్ర‌ఫీ :  జోషి
ఓటీటీ రిలీజ్ : ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌
రిలీజ్ డేట్ : 25 – 07- 2020

స్టార్ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం `ప‌వ‌ర్‌స్టార్‌`. ఇది ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని ఉద్దేశించి తీసిన సినిమా కాదు కాదంటూనే వ‌ర్మ ఏకంగా ప‌వ‌న్‌ని పోలిన న‌టుడిని తెర‌పైకి తీసుకొచ్చి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. తొలి నుంచి వివాదాలు చుట్టుముట్టడం, వ‌ర్మ ఆఫీసుపై జ‌న‌సైనికులు దాడికి దిగ‌డంతో `ప‌వ‌ర్‌స్టార్‌` సినిమాపై స‌ర్వ‌త్రా క్రేజ్ ఏర్ప‌డింది. చెప్పేదొక‌టి చేసేదొక‌టి అన్న‌ట్టుగా వ‌రుస చిత్రాల్ని రిలీజ్ చేస్తూ ట్రైల‌ర్‌లో త‌ప్ప సినిమాలో కంటెంట్ లేకుండా ఊద‌ర‌గొడుతున్న రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రి `ప‌వ‌ర్‌స్టార్‌` విష‌యంలోనూ అదే జిమ్మిక్కును ఫాలో అయ్యాడా?  లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

ప్ర‌వన్‌క‌ల్యాణ్‌.. టాలీవుడ్‌లో స్టార్ హీరో. మ‌న సేన పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తారు. రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్ర‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ రెండు స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని కూడా ద‌క్కించుకోలేక దారుణంగా ఓట‌మి పాల‌వుతాడు. దాంతో ప్ర‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి చేరుకుంటుంది. త‌ను రెండు సీట్లు ల్లో ఒక్క‌టి కూడా ద‌క్కించుకోలేద‌ని వార్త‌ల్లో వినిపిస్తుండ‌టంతో అస‌హ‌నానికి గురైన ప్ర‌వ‌న్‌క‌ల్యాణ్ టీవీల‌ని బ‌ద్ద‌లు కొట్టేస్తాడు. ప్ర‌వ‌న‌ప్ ప‌రిస్థితి ఇంట్లో వాళ్ల‌కు అర్థం కాదు. ఇదిలా వుంటే `రాజ‌కీయ వేదిక‌ల‌పై నేను కానిస్టేబుల్ కొడుకుని అంటావు.. నువ్వు ప‌వ‌ర్‌స్టార్ అయ్యింది నా తమ్ముడిగానా లేక కానిస్టేబుల్ కొడుకుగానా .. హాయిగా సినిమాలు తీసుకో నీకెందుకు రాజ‌కీయాలు`అని    ప్ర‌వ‌న్ క‌ల్యాణ్ పెద్ద‌న్న‌య్య స్టార్ మెగా అంటాడు. మ‌రో అన్న‌య్య ఎవ‌రో తిట్టిన మాట‌ల్ని మ‌ళ్లీ గుర్తు చేస్తుంటాడు. ఇంత‌లో ఆర్జీవీ ఎంట‌ర‌వుతాడు. అత‌ను ప్ర‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెప్పింది ఏమిటి? ఇంత‌కీ ప్ర‌వ‌న్ ఎవ‌రి మాట విన్నాడు అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న :

ప‌వ‌న్‌కల్యాణ్ పాత్ర‌లో న‌టించిన వ్య‌క్తి త‌న పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేశాడ‌ని చెప్పాలి. అత‌ని చేత ప‌వ‌న్‌ని ముమ్మూర్తులా ప్ర‌తిబింబించేలా వ‌ర్మ తీసుకున్న జాగ్ర‌త్త‌కు షాక‌వ్వాల్సిందే. అంత‌గా అత‌న్ని వెతికి ప‌ట్టుకోవ‌డంతో శ్ర‌ద్ధ చూపించిన వ‌ర్మ క‌థ‌, క‌థ‌నాలు, చెప్పాల‌నుకున్న పాయింట్ పై మాత్రం ఆస‌క్తిని చూపించ‌లేద‌ని తెలుస్తోంది. స్టార్ మెగా పాత్ర‌లో చేసిన వ్య‌క్తి, త్రివిక్ర‌మ్‌ని పోలిన వ్య‌క్తి, చంద్ర‌బాబు నాయుడు డూప్‌, నాగ‌బాబు డూప్ ఇలా చాలా మంది డూప్‌ల‌ని స‌మ‌ర్థ‌వంతంగా వ‌ర్మ వాడుకున్నాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు :

కెమెరా ప‌నిత‌నం బాగున్నా మేకింగ్ మ‌రీ నాసిర‌కంగా వున్న‌ట్టు కౌంట‌ర్‌లు వినిపిస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్ క్వాలిటీకి ఏ మాత్రం కంపేర్ చేయ‌లేని స్థాయిలో వ‌ర్మ ఈ చిత్రాన్ని చుట్టేశాడ‌ని చెప్పాలి. నైట్ ఓడ్కా తాగేసి అనుకున్న పాయింట్స్‌నే తెర‌పై చూపించాల‌ని చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. క్వాలిటీ విష‌యంలో చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు.

విశ్లేష‌ణ‌:

కేవ‌లం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మాత్ర‌మే టార్గెట్‌గా పెట్టుకుని వ‌ర్మ చేసిన చిత్ర‌మిది. దీన్ని సినిమా అన‌డం కంటే షార్ట్ ఫిల్మ్ అనొచ్చు. ఆ స్థాయిలో వుంది. వ‌ర్మ లాంటి వ్య‌క్తి ఇంత‌కు దిగ‌జారాడా అనే స్థాయిలో ఈ సినిమా మేకింగ్, టేకింగ్ వుంది. ప‌వ‌న్ బ్రాండ్‌ని ఈ క‌ష్ట‌కాలంలో వాడుకుని నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని వ‌ర్మ చేసిన ప్ర‌య‌త్నంగా `ప‌వ‌ర్‌స్టార్‌` క‌నిపిస్తోంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌న నిర్ణ‌యాలు కాకుండా ప‌క్క వారు చెప్పిన మాట‌ల్ని మాత్ర‌మే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వింటార‌ని, ప‌క్క వాళ్ల మాట‌లు న‌మ్మి న‌ష్ట‌పోతున్నార‌ని వ‌ర్మ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.

రేటింగ్: 2.25/5