`ప‌వ‌ర్‌స్టార్‌` ట్రైల‌ర్ రివ్యూ!



`ప‌వ‌ర్‌స్టార్‌` ట్రైల‌ర్ రివ్యూ!
`ప‌వ‌ర్‌స్టార్‌` ట్రైల‌ర్ రివ్యూ!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ప‌వ‌ర్‌స్టార్‌`.  ప‌వ‌న్ జీవితంపై సినిమా కాదంటూనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని టార్గెట్ చేశాడు వ‌ర్మ‌. ఈ మూవీ ట్రైల‌ర్ ఈ 22 ఉద‌యం యూట్యూబ్‌లో విడుద‌లైంది. వ‌ర్మ పక్కా ప్లాన్ ప్ర‌కార‌మే ట్రైల‌ర్‌ని త‌న టీమ్ చేత లీక్ చేయించి త‌న‌కు తెలియ‌కుండా ట్రైల‌ర్‌ని లీక్ చేశార‌ని ఓ ట్వీట్ వేశారు కూడా. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారిన ఈ ట్రైల‌ర్‌లో ఏముంది?  అంతా ఊహించిన‌ట్టే వ‌ర్మ త‌న పైత్యాన్నంతా చూపించాడా? అన్న‌ది తెలియాలంటే ట్రైల‌ర్‌పై ఓ లుక్కేద్దాం.

`లార్డ్ బాలాజీ మీద ఒట్టు ఈ సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌ను` అని చెప్పిన వ‌ర్మ త‌న మాట‌ని గాలికి వ‌దిలేసి అంతా అనుకున్న‌ట్టే చేశాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని ఎంత వ‌ర‌కు కించ‌ప‌ర‌చాలో అంత వ‌ర‌కు కించ‌ప‌రిచి వ‌ర్మ‌ పైశాచిక ఆనందం పొందిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరుని ప్ర‌వ‌న్‌క‌ల్యాణ్‌గా మార్చిన వ‌ర్మ ఈ చిత్రం ప్ర‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కి అంకితం అంటూ ట్రైల‌ర్‌ని ప్రారంభించాడు. ఫామ్ హౌస్ స‌న్నివేశాల‌ని చూపిస్తూ మొద‌లుపెట్టిన వ‌ర్మ `ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రాత్రి` అంటూ చీక‌ట్లో ప‌వ‌న్ కూర్చుని ఫ‌లితాలు టీవీలో చూస్తూ అస‌హ‌నంతో టీవీని ప‌గ‌ల‌గొట్ట‌డం వంటి స‌న్నివేశాల్ని చూపించి మ‌రో ర‌చ్చ‌కు తెర‌లేపారు.

`ఒక్క సీటు ఒక్క సీటు కూడా రాలేదా..` అంటూ ప‌వ‌ర్ స్టార్ డైలాగ్ చెప్పగా.. ఒక్క‌టి వ‌చ్చింది సార్‌.. కానీ మీకు ఒక్క‌టి కూడా రాలేదు.. అని పంచ్ వేయించారు. అస‌హ‌నంతో టీవీని ప‌గ‌ల‌గొట్టిన ప‌వ‌ర్‌స్టార్ ఒక్క స్పీచ్ కూడా వ‌ర్క‌వుట్ కాలేద‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ని పోలిన వ్య‌క్తి చెప ఛెల్లు మ‌నిపించ‌డం.. ఒక్క‌సారి నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్ప‌రా  నువ్వు ప‌వ‌ర్‌స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా?  లేక నా త‌మ్ముడు గానా? అంటూ చిరు డూప్ ప‌వ‌న్‌ని ప్ర‌శ్నించ‌డం.. ఇక చంద్ర‌బాబు పాత్ర‌ని పోలిన వ్య‌క్తి తో `స‌త్య‌ప్ర‌మాణ‌‌కంగా చెప్తున్నాను బ్ర‌ద‌ర్ మీరు ఓడిపోయినందుకు చాలా బాధ‌ప‌డుతున్నాను` అని చెప్పించ‌డం.. మిమ్మ‌ల్ని న‌మ్మొద్దంటూ చాలా మంది చెప్పారు ఇక్క‌డి నుంచి వెళ్లిపోండ‌ని ప‌వ‌ర్‌స్టార్ అర‌వ‌డం… ఇవీ కాకుండా వ‌ర్మ ప‌వ‌ర్‌స్టార్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని, భార్య‌ల మ‌ధ్య ప‌వ‌న్ న‌లిగిపోతున్నాడ‌ని చెప్పే విధంగా ఓ స‌న్నివేశాన్ని క్రియేట్ చేయ‌డం.. ఓవ‌రాల్‌గా `ప‌వ‌ర్‌స్టార్‌` సినిమా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితానికి భంగం క‌లిగించే విధంగా వుంద‌ని చాలా క్లియ‌ర్‌గా స్ప‌ష్ట‌మౌతోంది. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఎలాంటి చ‌ర్య తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Credit: Twitter