ప్రభాస్ జాన్ మళ్ళీ మొదటికి వచ్చిందా?ప్రభాస్ జాన్ మళ్ళీ మొదటికి వచ్చిందా?
ప్రభాస్ జాన్ మళ్ళీ మొదటికి వచ్చిందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సెటప్ అంతా రెడీగా ఉన్నా తన తర్వాతి చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టలేకున్నాడు. బాహుబలి వంటి అతిపెద్ద విజయం తర్వాత ప్రభాస్ కేవలం ఒకే సినిమా అనుభవమున్న సుజీత్ చేతిలో సాహో చిత్రాన్ని పెట్టాడు. నిజానికి బాహుబలి విడుదలకు ముందు 50 కోట్ల బడ్జెట్ తో తీద్దామనుకున్న సాహో తర్వాత ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరగడంతో 300 కోట్లకు పెంచారు. అంటే అదే కథకి ఆరు రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టాలని డిసైడ్ అయిపోయారు. దీనర్ధం అదే కథను 50 కోట్లలో కూడా తీయొచ్చు. కాకపోతే అదనపు హంగులను, నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న కాస్ట్ ను తీసుకున్నారు. చిన్న చిన్న పాత్రలకు కూడా బడా బాలీవుడ్ యాక్టర్లను తీసుకోవడంతో మొత్తానికి వారు అనుకున్న 300 కోట్ల లక్ష్యాన్ని చేరుకోగలిగారు కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సాహో నుండి చాలా ఆశించారు ప్రేక్షకులు. అయితే సినిమా చూసి డిజప్పోయింట్ అవ్వడం మినహా వారు చేయగలిగింది అంటూ ఏమీ లేకుండా పోయింది. మొత్తానికి సాహో ఒక్క హిందీలో తప్పితే మిగిలిన అన్ని చోట్లా దారుణమైన ప్లాప్ గా ముద్ర వేయించుకుంది.

సాహో ఇచ్చిన దెబ్బతో ప్రభాస్ కొన్నాళ్ల పాటు కోలుకోలేదు. నిజానికి సాహో విడుదలైన రెండు నెలలకు ప్రభాస్ తన తర్వాతి చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టాలి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ తో సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ కూడా ఒక్క సినిమా అనుభవం ఉన్నవాడే. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కూడా ముందు అనుకున్న దానికంటే అమాంతం పెంచేశారు. ఇలా సాహోతో ఎన్నో విషయాల్లో పోలిక కలిగి ఉండడం వల్ల ప్రభాస్ దిద్దుబాటు చర్యలకు దిగాడు. జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ నిజానికి ఎప్పుడో మొదలైంది. యూరప్ లో చిన్న షెడ్యూల్ కూడా ముగించుకుంది. మిగిలిన షెడ్యూల్స్ సాహో విడుదలయ్యాక పూర్తి చేసి 2020 మధ్యకల్లా సినిమాను దించాలని ప్లాన్ చేసారు. అయితే సాహో ప్లాప్ అవ్వడంతో ఈ కథకు మరమత్తులు చేయడం మొదలుపెట్టారు.

స్క్రిప్ట్ డాక్టర్స్ ను రంగంలోకి దించారు. ప్రొడక్షన్ డిజైన్ ను మొత్తం రీడిజైనింగ్ చేసారు. ఎఫెక్టివ్ గా ఈ సినిమాను ఎలా నిర్మించాలో ముందే పథకాలు సిద్ధం చేసుకున్నారు. ఇంతా సిద్ధం చేసుకుని నవంబర్ నుండి షూటింగ్ అన్నారు, కానీ అది జరగలేదు. డిసెంబర్ నుండి అన్నారు, కానీ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు. దానికి కారణం ప్రభాస్ ఇప్పుడు యూఎస్ టూర్ లో ఉన్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాడన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. సో డిసెంబర్ నుండి ఉండకపోవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ కు మళ్ళీ మార్పులు చేర్పులు చేపడుతున్నారట. పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చాకే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఉండే అవకాశముంది. అంటే లేట్ సమ్మర్ రిలీజ్ ఇక కుదరదు, ఏ దసరాకో ప్లాన్ చేసుకోవాలి.