మొత్తానికి.. ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది!


మొత్తానికి.. ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది!
మొత్తానికి.. ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది!

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు. బాహుబలి అఖండ విజయం తర్వాత రెండు సినిమాలను ఓకే చేసాడు ప్రభాస్. మొదటిది సుజీత్ దర్శకత్వంలో సాహో కాగా రెండోది రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్. ఈ ఇద్దరు దర్శకులు కేవలం ఒక్క సినిమాకే దర్శకత్వం వహించి ఉన్నారు. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో ఫలితం అందరం చూసాం. ఈ సినిమా ప్రభాస్ కున్న క్రేజ్ వల్ల హిందీలో వర్కౌట్ అయింది కానీ మిగిలిన భాషల్లో పనవ్వలేదు. ఆ ఎఫెక్ట్ జాన్ చిత్రంపై గట్టిగా పడింది. సాహో సినిమా షూటింగ్ సమయంలోనే జాన్ సినిమాకు యూరోప్ లో ఒక షెడ్యూల్ చేసారు. అయితే సాహో విడుదలైన రెండు నెలలకు ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టాలి కానీ ఆ ఫలితంతో ప్రభాస్ అండ్ టీమ్ జాగ్రత్త పడ్డారు. దాదాపు సాహోకు పని చేసిన టీమ్ జాన్ కు చేస్తుండడంతో జాన్ కు మొత్తం రీ వర్క్ చేసారు. స్క్రిప్ట్ ను టైట్ చేయడంతో పాటు బడ్జెట్ ను కూడా 40 శాతానికి పైగా కుదించారు.

మొత్తం విదేశాల్లో షూటింగ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్ లోనే వివిధ స్టూడియోల్లో, ప్రైవేట్ స్థలాల్లో సెట్స్ వేసి వాటిని షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే అన్నపూర్ణలో సెట్ కంప్లీట్ అయింది. అందుకే ఇక్కడ రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ వారంలోనే జాన్ షూటింగ్ తిరిగి మొదలుకాబోతోందని వార్తలు అందాయి. ప్రభాస్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయబోతున్నారు.

అలాగే అన్నపూర్ణలో షూట్ పూర్తయ్యాక, రామానాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి చోట్ల కూడా సెట్స్ వేస్తున్నారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇలా జాన్ చిత్ర మెజారిటీ భాగాన్ని ఇక్కడే పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. పాటలకు యూరోప్ వెళ్లి పూర్తి చేసుకుని వస్తారని వినికిడి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. పూజ హెగ్డే కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.