అనుష్కతో లింకప్ రూమర్స్ పై స్పందించిన ప్రభాస్, తప్పకుండా పెళ్లి చేసుకుంటా!!


అనుష్కతో లింకప్ రూమర్స్ పై స్పందించిన ప్రభాస్, తప్పకుండా పెళ్లి చేసుకుంటా!!
అనుష్కతో లింకప్ రూమర్స్ పై స్పందించిన ప్రభాస్, తప్పకుండా పెళ్లి చేసుకుంటా!!

ప్రభాస్ – అనుష్క మధ్య రూమర్స్ రావడం ఈనాటిది కాదు. మిర్చి టైమ్ నుండే వీరిద్దరి మధ్య రూమర్స్ మొదలయ్యాయి. బిల్లాలో ఇద్దరూ కలిసి నటించినా అప్పట్లో ఇద్దరూ క్లోజ్ ఉండడం మీడియా కంటికి చిక్కలేదు. ఇక బాహుబలి 1 అండ్ 2 లో ఇద్దరూ కలిసి నటించడం, ఆ తర్వాత ప్రమోషన్స్ సమయంలోనూ, బయట ఫంక్షన్ లలోనూ ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడంతో వీరిద్దరి మధ్యనా లింకప్ రూమర్స్ అనేవి ఎక్కువైపోయాయి. అప్పట్లో ఈ జంట రూమర్లను లైట్ తీసుకుని స్పందించకపోవడంతో అవి నిజమేననుకుని ప్రేక్షకులు నమ్మడం మొదలుపెట్టారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చే వరకూ పరిస్థితి వెళ్ళింది. అయితే ఇటీవలే కరణ్ జోహార్ షోలో ప్రభాస్ ఈ వార్తల్ని ఖండించాడు.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు బాలీవుడ్ వరకూ వెళ్లడంతో ప్రభాస్ స్పందించక తప్పని పరిస్థితి.

తామిద్దరం కేవలం స్నేహితులమని ప్రభాస్ చెప్పాడు. అప్పట్లో ఈ రూమర్స్ కొంచెం తగ్గాయి కానీ మళ్ళీ ఇద్దరూ కలిసి మీడియా కంటికి చిక్కడంతో గాసిప్ రాయుళ్లకు పని దొరికింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ను మీడియా ఇదే ప్రశ్న అడిగింది. దానికి ప్రభాస్ స్పందిస్తూ “అనుష్క నాకు 11 ఏళ్లుగా ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఎక్కువ సినిమాలు చేసాం. మధ్యలో రూమర్స్ తగ్గినట్లు అనిపించినా మళ్ళీ మొదలయ్యాయి. అనుష్కతో నేను డేటింగ్ చేస్తుంటే దాచాల్సిన అవసరమేముంది. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి పెళ్ళైతే కానీ ఈ రూమర్స్ కు అడ్డుకట్ట పడేలా లేదు” అని సమాధానమిచ్చాడు.

దానికే కొనసాగింపుగా “నేనిప్పుడు శ్రద్దా కపూర్ తో ఒక సినిమా చేశాను. మళ్ళీ త్వరలో మరో సినిమా చేస్తే మా ఇద్దరి మధ్య గాసిప్స్ పుట్టిస్తారా” అని అడిగాడు. ఇక పెళ్లి గురించి స్పందిస్తూ, “నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. రెబెల్ చేస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచనలు వచ్చాయి కానీ అప్పుడే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చింది. దాంతో ఐదేళ్లు పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చింది. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా” అని చెప్పాడు ప్రభాస్.

శ్రద్దా కపూర్ తో ప్రభాస్ సాహోలో కలిసి నటించిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ అవ్వగా, మిగిలిన భాషల్లో విఫలమైంది. ప్రస్తుతం ప్రభాస్ తన తర్వాతి సినిమా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టేందుకు సమాయత్తమవుతున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ తర్వాతి షెడ్యూల్ నవంబర్ నుండి హైదరాబాద్ లో స్పెషల్ వేసిన సెట్ లో మొదలవుతుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. కృష్ణంరాజు, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా విడుదల కానుంది.