ప్రభాస్ అభిమానులకు అసలైన సంక్రాంతి రేపే


ప్రభాస్ అభిమానులకు అసలైన సంక్రాంతి రేపే
ప్రభాస్ అభిమానులకు అసలైన సంక్రాంతి రేపే

రెబెల్ స్టార్ ప్రభాస్ గతేడాది సాహోతో వచ్చి అభిమానులను నిరాశపర్చిన సంగతి తెల్సిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా బడ్జెట్ పరిధులు దాటి వెళ్లిపోవడంతో తెలుగులో కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా మిగిలింది. అయితే ప్రభాస్ కున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా హిందీలో 150 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ ఫెయిల్యూర్ తో ప్రభాస్ పునరాలోచనలో పడినట్లు తెలిసింది.

నిజానికి సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ వెంటనే మొదలుపెట్టి 2020 సమ్మర్ కు విడుదల చేయాలి. అయితే సాహో ప్లాప్ తో ప్రభాస్ ఈ సినిమాకు కొన్ని మార్పులు సూచించాడు. బడ్జెట్ కుదింపు ఒకటైతే స్క్రిప్ట్ ను మళ్ళీ మరోసారి సమీక్షించమని కోరాడు. దాంతో అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. అయితే ఎన్ని రోజులవుతున్నా ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఎప్పటి నుండి షూటింగ్ మొదలవుతుంది అన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఒకరకమైన ఆందోళన మొదలైంది. ఈ చిత్ర నిర్మాతలను, పిఆర్ లను ప్రభాస్ 20వ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వమని కోరుతూనే ఉన్నారు.

అయితే వాళ్ళ కోరికను మన్నించిన యూవీ క్రియేషన్స్ సంస్థ రేపు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రభాస్ తన అభిమానులతో పంచుకోనున్నట్లు ప్రకటించింది. అయితే సమయం మాత్రం వెల్లడించలేదు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో నిజమైన సంక్రాంతి వచ్చిన భావన కలుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ + ఫస్ట్ లుక్ విడుదల చేస్తాడా లేక షూటింగ్ అప్డేట్ ఏమైనా ఇస్తాడా అని అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి దసరాకు షూటింగ్ ను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఎటువంటి అప్డేట్ రేపు ప్రభాస్ ఇస్తాడో చూడాలి.