ఈ వారమంతా ప్రమోషన్ల జాతర


ఈ వారమంతా ప్రమోషన్ల జాతర
ఈ వారమంతా ప్రమోషన్ల జాతర

సినిమాలకు ప్రమోషన్లు చాలా ముఖ్యమైపోయిన రోజులివి. టీజర్ నుండి ఒక్కో పాట విడుదల చేసుకుని, తర్వాత ట్రైలర్, ఆపై ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇక అన్నీ అయిపోయాక మీడియాకు ఇంటర్వ్యూలు. ఒక స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే ఇదీ ఒక సగటు తెలుగు సినిమాకు జరుగుతున్నా ప్రచారశైలి. ఇదివరకు పరిస్థితి ఇలా ఉండేది కాదు. పాటలు అన్నీ ఒకే ఆల్బమ్ గా విడుదల చేసి ఆడియో లాంచ్ ఈవెంట్ చేసారు. కానీ ఇప్పుడు కేసెట్, సిడిల కాలం చెల్లిపోయింది పైగా డిజిటల్ గా ఉచితంగా దొరుకుతున్నాయి కాబట్టి ఆడియో లాంచ్ ప్లేస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో డల్ ఫేజ్ నడుస్తోంది. థియేటర్లలో సరైన సినిమాలు లేక అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యం అంతా ఆందోళన చెందుతున్నారు. సినిమాలు విడుదలవుతున్నా అవి అంత ప్రామిసింగ్ గా లేకపోవడం ఇక్కడ అసలు సమస్యగా మారింది. దానికి తోడు సాధారణంగానే నవంబర్ అంటే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఆసక్తి చూపించరు. అయితే ఈ పరిస్థితిలో మార్పు త్వరలోనే రానుంది. డిసెంబర్ 20 నుండి సినిమాల వెల్లువ ఉంటుంది. ప్రామిసింగ్ సినిమాలు నెల రోజుల వ్యవధిలో దాదాపు పది వరకూ విడుదల కానుండడం టాలీవుడ్ కు శుభ పరిణామం.

సినిమాల విడుదల దగ్గరకు వస్తుండడంతో ప్రమోషన్స్ దూకుడు కూడా పెంచారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణకు సంబంధించిన రూలర్ మొదటి సింగిల్ అడుగడుగో యాక్షన్ హీరో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఈ పాటలో బాలకృష్ణ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది అన్నది వివరించారు. ఇక రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. ఇది కూడా మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ తో దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరు నుండి ఇకపై 5 సోమవారాలు ఐదు పాటలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా మొదటి పాట రేపు రానుంది.

ఇక డిసెంబర్ 6న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్ ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంత మంచివాడవురా పెద్ద సినిమాల మధ్య సంక్రాంతి రేసులో నిలవబోతోంది. మాస్ మహారాజా రవితేజ కూడా తగ్గట్లేదు. తన లేటెస్ట్ సినిమా డిస్కో రాజా ప్రమోషన్స్ కు ఈ వీక్ లోనే చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్లే డిసెంబర్ 6న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాను మొదట క్రిస్మస్ బరిలో నిలపాలని అనుకున్నారు కానీ ఇప్పుడు జనవరి ఆఖరు వారానికి షిఫ్ట్ చేసేసారు. వీరందరితో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ప్రతిరోజూ పండగే నుండి ఈ వారంలోనే మరో అప్డేట్ రానుంది తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. అల వైకుంఠపురములో కూడా ఈ వీక్ లో టీజర్ లాంటిదేమైనా విడుదల చేద్దామా అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి ప్రమోషనల్ మెటీరియల్స్ తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తారన్నమాట.