రాగల 24 గంటల్లో మూవీ రివ్యూ


Raagala 24 Gantalu Movie Review and rating
Raagala 24 Gantalu Movie Review and rating

దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: కానూరు శ్రీనివాస్
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీకాంత్, గణేష్ వెంకట్రామన్
విడుదల తేదీ: నవంబర్ 22, 2019

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్, తెలుగమ్మాయి ఈషా రెబ్బ, తెలుగువారు దాదాపు మర్చిపోయిన శ్రీకాంత్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన రాగల 24 గంటల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ చిత్రాలతో పాపులర్ అయ్యి ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిపోయిన శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి థ్రిల్లర్ గా తెరకెక్కిన రాగల 24 గంటల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే దమ్ముందా లేదా అన్నది చూద్దాం.

కథ:
ఒక స్టార్ ఫోటోగ్రాఫర్ అయిన రాహుల్ (సత్యదేవ్), విద్య (ఈషా రెబ్బ)తో ప్రేమలో పడతాడు. వీరి జీవితాలు సాఫీగా సాగిపోతున్న సమయంలో విద్య, తన ఫ్రెండ్ గణేష్ (గణేష్ వెంకట్రామన్)కు క్లోజ్ గా ఉండడాన్ని సహించలేకపోతాడు రాహుల్. వీరి ముగ్గురి మధ్యన ఈ విషయంలో గొడవ కూడా అవుతుంది. అయితే అనుకోకుండా రాహుల్ చంపబడతాడు. రాహుల్ ను చంపిందెవరు? ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి శ్రీకాంత్ రంగంలోకి దిగుతాడు. అతనికి దొరికిన క్లూస్ ఏంటి? రాగల 24 గంటల్లో ఏం జరిగింది? అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి.

నటీనటులు:
సత్యదేవ్ ఎంత మంచి నటుడన్నది మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. తనకొచ్చిన లిమిటెడ్ అవకాశాల్లోనే సత్యదేవ్ తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. నటించడానికి స్కోప్ ఉన్న మరో మంచి పాత్ర సత్యదేవ్ కు ఈ చిత్రం ద్వారా దొరికింది. తన టాలెంట్ కు తగ్గ న్యాయం ఈ సినిమాలో చేసాడు. నెగటివ్ రోల్ లో, ప్రేమికురాలిని హింస పెట్టే పాత్రలో సత్యదేవ్ నటన బాగుంది. ఈషాకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికింది. కీలకమైన సన్నివేశాల్లో ఈషా నటన మెప్పిస్తుంది. ఎమోషన్స్ ను బలంగా పండించగలిగింది ఈషా. ఇక శ్రీకాంత్ పోలీస్ గా బాగానే చేసాడు. గణేష్ వెంకట్రామన్ కూడా ఓకే. మిగతా వాళ్లంతా పాత్రల పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:
శ్రీనివాసరెడ్డి ఎంచుకున్న కథలో ఎక్కువ మెలికలు లేవు. నరేషన్ చాలా స్లో గా ఉంది. మరీ ఇంత స్లో గా ఉండడానికి గల కారణాలు అర్ధం కావు. ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ లు ఏం లేవు. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేయొచ్చు. ఇది స్క్రీన్ ప్లే లో లోపమే. ఒకే బంగ్లాలో జరిగే కథే అయినా కెమేరామ్యాన్ మొనాటనీ రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం అలరిస్తుంది.

చివరిగా :
రాగల 24 గంటల్లో చాలా సింపుల్ కథ. ఎక్కువ ట్విస్ట్ లు లేకుండా చాలా సింపుల్ గా తేల్చేస్తాడు శ్రీనివాస రెడ్డి. డిజిటల్ మీడియా పెరిగిపోయాక థ్రిల్లర్ అంటే సాదాసీదాగా చూపించేస్తానంటే పనవ్వదు. ఈ విషయంలో రాగల 24 గంటల్లో మెప్పించదు. చాలా సింపుల్ గా జరిగే కథకు, స్లో పేస్ భయంకరమైన అడ్డంకిగా నిలిచింది. ఈ రెండు కారణాలతోనే రాగల 24 గంటల్లో సగటు చిత్రంగా మిగిలిపోతుంది.

రేటింగ్ : 2.5/5