ఆ డ్రీమ్ గాళ్ ఇత‌గాడే!


Raj Tarun in Dream Girl remake
Raj Tarun in Dream Girl remake

వెర్స‌టైల్‌ ఆర్టిస్ట్ ఆయుష్మాన్ ఖురానా ఏ సినిమా చేసినా బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురుస్తోంది. తొలి ప్ర‌య‌త్నంలోనే `విక్కీడోన‌ర్` వంటి విభిన్న‌మైన క‌థాంశాన్ని ఎంచుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అంద‌కున్న ఆయుష్మాన్ ఆ త‌రువాత చిత్రాల విష‌యంలోనూ అదే పంథాను కొన‌సాగిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. కొత్త త‌ర‌హా చిత్రాల‌కు బాలీవుడ్‌లో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఆయ‌న ఇటీవ‌ల న‌టించిన ద‌మ్ ల‌గాకే హైస్సా`, శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్‌, అంధాధూన్‌, బ‌ధాయిహో, ఆర్టిక‌ల్ 15, డ్రీమ్ గాళ్, బాల  చిత్రాలు వ‌రుస విజ‌యాల్ని అందించాయి.

ఆయుష్మాన్ న‌టించిన హిట్ చిత్రాల్లో కొన్ని ఇత‌ర భాష‌ల్లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఓ చిత్రం తెలుగులో రీమేక్ కాబోతోంది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన `డ్రీమ్ గాళ్‌` బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత డి. సురేష్‌బాబు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రీమేక్ చేయ‌బోతున్నారు. ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్ర‌ని ఈ సినిమాలో యంగ్ హీరో రాజ్ త‌రుణ్ న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోమ‌వారం మీడియాతో వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర వ‌ర్గాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిసింది.

రాజ్ త‌రుణ్ న‌టించిన తాజా చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. యంగ్ డైరెక్ట‌ర్ జి.ఆర్‌. కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు నిర్మించారు. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ త‌రుణ్ ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌.