ఆ చిత్రంపైనే ఈ యువ హీరో ఆశలన్నీ


Raj Tarun pins all his hopes on orey Bujjiga
Raj Tarun pins all his hopes on orey Bujjiga

ఇండస్ట్రీలో సక్సెస్ రావడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని అంటుంటారు. అది నూటికి నూరు పాళ్ళు నిజమని యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ను చూస్తే అర్ధమవుతుంది. ఇండస్ట్రీకి దర్శకుడు అవుదామని వచ్చి అనుకోకుండా నటుడు అయ్యాడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జేరి అనుకోకుండా హీరో సెట్ కాకపోవడంతో తనే హీరోగా అవతారమెత్తాడు. అయితే మొదట్లో రాజ్ తరుణ్ కెరీర్ భలేగా సాగింది. వరసగా సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, ఈడో రకం ఆడో రకం వంటి హిట్లతో యువ హీరోల్లో టాప్ రేంజ్ లో దూసుకుపోయాడు. ఒకానొక సమయంలో ఈ యువ హీరో రెమ్యునరేషన్ కోటి రూపాయలు కూడా దాటిపోయింది. మొదటి చేసిన ఐదు సినిమాల్లో నాలుగు హిట్లు చూసిన రాజ్ తరుణ్ కు అవకాశాలు కూడా వెల్లువలా వచ్చి పడ్డాయి. దీంతో ఏ సినిమా ఎంచుకోవాలో తెలియకో మరొకటో కానీ కథల ఎంపికలో చాలానే తప్పులు చేసాడు రాజ్ తరుణ్.

దీంతో వరసగా ప్లాపులు అతణ్ణి పలకరించడం మొదలయ్యాయి. రెండేళ్లలో దాదాపుగా ఆరు ప్లాపులు ఈ యువ హీరోని చుట్టుముట్టాయి. అదే సమయంలో దిల్ రాజుతో చేసిన లవర్ కూడా డిజాస్టర్ అయింది. సాధారణంగా కథల ఎంపికపై మంచి పట్టు ఉన్న దిల్ రాజు, రాజ్ తరుణ్ విషయంలో తప్పటడుగు వేసాడు. ఒకసారి అయితే అనుకోవచ్చు, రీసెంట్ గా రెండోసారి కూడా ఇద్దరి లోకం ఒకటే చిత్రం ద్వారా మళ్ళీ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఒకే హీరోతో ఇలా వరస డిజాస్టర్లను ఎదుర్కోవడం దిల్ రాజుకి ఇదే తొలిసారి.

క్రిస్మస్ కు విడుదలైన ఇద్దరి లోకం ఒకటే చిత్రానికి మొదటి రోజు నుండే కలెక్షన్స్ పడిపోయాయి. టాక్ దారుణంగా ఉండడంతో ఈ సినిమాను పట్టించుకునే నాథుడే లేదు. ఇలా ప్లాపుల్లో డబల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం చేస్తోన్న ఒరేయ్ బుజ్జిగా సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలతో మెప్పించిన విజయ్ కుమార్ కొండా తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తన మూడో ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ నిర్మాతలు రాజ్ తరుణ్ వైపు చూసే పరిస్థితి ఉంటుంది.