రాజ్ త‌రుణ్ కోరిక నెర‌వేరుతుందా?

రాజ్ త‌రుణ్ కోరిక నెర‌వేరుతుందా?
రాజ్ త‌రుణ్ కోరిక నెర‌వేరుతుందా?

అంతా డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యాం అంటుంటారు కానీ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాత్రం డైరెక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్‌గా మారాడు. 52 షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభ‌వంతో ద‌ర్శ‌కుడిని కావాల‌నే ల‌క్ష్యంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు రాజ్ త‌రుణ్. అయితే త‌ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఎంపికైన సినిమాతో యాక్సిడెంట‌ల్ గా హీరోగా ప‌రిచ‌యం కావాల్సి వ‌చ్చింది. అదే `ఉయ్యాలా జంపాలా`. షార్ట్ ఫిల్మ్స్‌తో ఎంట‌రై ఏకంగా హీరో అయిపోయాడు.

ఆ త‌రువాత వెనుదిరిగి చూసుకోని రాజ్ త‌రుణ్ సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌, కిట్టు వున్నాడు జాగ్ర‌త్త వంటి వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా `ఒరేయ్ బుజ్జిగా` చిత్రంతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆలీ టాక్ షోలో పాల్గొన్న రాజ్ తరుణ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. త‌ను హీరోగా మారినా ద‌ర్శ‌కుడు కావాల‌న్న క‌ల ఇంకా అలాగే వుంద‌ని ఖ‌చ్చితంగా ద‌ర్శ‌కుడిగా మార‌తాన‌ని చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్, సునీల్‌లను దృష్టిలో పెట్టుకుని రెండు స్క్రిప్ట్‌లను రాశానని, ఎప్ప‌టికైనా వారితో ఆ క‌థ‌ల్ని తెర‌కెక్కిస్తాన‌ని చెప్పాడు రాజ్ త‌రుణ్‌. ఈ ఇద్ద‌రు హీరోల్లో రాజ్ త‌రుణ్ ఎక్కువ‌గా సునీల్‌తో చ‌నువుగా వుంటాడు. వ‌చ్చే ఏడాది అత‌నితో రాజ్ త‌రుణ్ సినిమా చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని వినిపిస్తోంది. ఇక ఇదే వేదిక‌పై గీత గోవిందం, ట్యాక్సీవాలా, శ‌త‌మాన‌పం భ‌వ‌తి చిత్రాల ఆఫ‌ర్ల‌పై క్లారిటీ ఇచ్చాడు.

`గీతా గోవిందం` కోసం తనను సంప్రదించలేదని చెప్పిన రాజ్ తరుణ్ బిజీ షెడ్యూల్ కారణంగా `శతమానం భవతి`ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు. `ట్యాక్సీవాలా` క‌థ త‌న‌కెంతో న‌చ్చింద‌ని, అయితే హార‌ర్ జోన‌ర్ కావ‌డంతో ఆస‌క్తి చూపించ‌లేద‌న్నారు.